CBN: మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు తెస్తాం

తెలుగుదేశం పార్టీకి వెనుకబడిన వర్గాలే వెన్నెముక అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కష్టపడి పనిచేసే స్వభావం ఉన్నవారికి అండగా నిలవడం ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యమని చంద్రబాబు అన్నారు. వేట నిషేధ సమయంలో ఆదాయం లేక మత్స్యకారులు పడే ఇబ్బందులను తాను ప్రత్యక్షంగా చూశానని, వారి కష్టాలను దృష్టిలో ఉంచుకొనే ఈ సాయాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించినట్లు చంద్రబాబు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెంలో మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించారు.
జీవితాల్లో వెలుగులు తెస్తాం
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఎన్ని ఇబ్బందులున్నా మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. గత ఎన్నికల్లో వెనకబడిన వర్గాలన్నీ కూటమికి అండగా నిలిచాయని.. వెనుకబడిన వర్గాల కోసం మరిన్ని కార్యక్రమాలు తీసుకొస్తామని సీఎం వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారని.. వైసీపీ హయాంలో తీసుకొచ్చిన రుణాలు ఏం చేశారో కూడా లెక్కలు లేవని విమర్శించారు. మత్స్యకార కుటుంబాలకు రూ.20 వేల చొప్పున సాయం అందిస్తున్నా మని తెలిపారు. పథకం కింద 1,29,178 కుటుంబాలకు రూ.259 కోట్ల లబ్ధి చేకూరుతోందని చెప్పారు. మత్స్యకార గ్రామాలను బాగుచేస్తామని తెలిపారు. తాము గత నాయకుల మాదిరిగా కాదన్నారు.
నేడు చంద్రబాబుతో డీజీపీ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబుతో డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా ఈరోజు సమావేశం కానున్నారు. పహల్గామ్ ఘటన, పాకిస్థాన్ పౌరుల వీసాల రద్దు, మే 2న అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన భద్రత ఏర్పాట్లు వంటి అంశాలపై వీరు ఇరువురు చర్చించనున్నారు.
చంద్రబాబుతో మంత్రి కొండపల్లి భేటీ
సీఎం చంద్రబాబుతో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ అయ్యారు. మత్స్యకార భరోసా పథకం నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం విచ్చేసిన చంద్రబాబును హెలిప్యాడ్ వద్ద మంత్రి కొండపల్లి మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మంత్రిని సీఎం ఆప్యాయంగా పలకరించారు. కార్యక్రమంలో గజపతినగరం నాయకులు పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com