AP: తిరుపతి లడ్డు ప్రసాదంపై సీఎం మళ్లీ సంచలన వ్యాఖ్యలు

AP: తిరుపతి లడ్డు ప్రసాదంపై సీఎం మళ్లీ సంచలన వ్యాఖ్యలు
X
లడ్డూ ప్రసాదంలో కొవ్వు వాడుతున్నట్లు స్పష్టం... కఠిన చర్యలు తప్పవన్న చంద్రబాబు

తిరుమల లడ్డూ ప్రసాదం పై సీఎం చంద్రబాబు మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో గత ప్రభుత్వం అన్నీ అపవిత్రం చేసిందని మండిపడ్డారు. పెళ్లిళ్లు, పేరంటాలకు వెంకటేశ్వరస్వామిని తీసుకెళ్లి అక్కడ కూడా ఊరేగించే పరిస్థితికి వచ్చారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వేంకటేశ్వరస్వామిని వాడుకోవడం కరెక్టు కాదన్నారు. ‘తిరుపతి వెంకటేశ్వర స్వామి హిందువులకు కలియుగ దేవుడు. అలాంటి వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెడితే ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారు. ప్రసాదంలో అపవిత్రమైన ముడిసరుకులు వాడారు. ఈ దుర్మార్గులను ఏం చేయాలో తెలియడం లేదు. ఆధారాలు దొరికితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడిని వాడుకోవద్దు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించొద్దు.” అని చంద్రబాబు అన్నారు.


ప్రక్షాళన షురూ...

ఇప్పటికే టీటీడీలో ప్రక్షాళన ప్రారంభించామని చంద్రబాబు వెల్లడించారు. పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేశారన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. అన్నదానంలోనూ నాసిరకం సరుకులు వాడారని మండిపడ్డారు. కాగా, గత వైసీపీ సర్కారు హయాంలో తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా.. ఆవు నెయ్యిలో సోయాబీన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలు వాడినట్లు రిపోర్టులో బయటపడింది. దీంతో పాటు చేప నూనె, బీఫ్ కొవ్వు, పామాయిల్, పంది కొవ్వు కూడా ఇందులో వాడినట్లు నివేదికలో స్పష్టమైంది. దీంతో చంద్రబాబు స్పందించి.. గత వైసీపీ సర్కార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సంచలన రిపోర్టు

గురువారం నాడు తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన గుజరాత్ ప్రభుత్వ రంగ సంస్థ NDDB CALF రిపోర్టు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కోసం వినియోగిస్తున్న నెయ్యిలో అడల్ట్రేషన్ జరుగుతోందని.. అందులో ఫిష్‌ ఆయిల్‌, పంది కొవ్వు, ఎద్దు కొవ్వు అవశేషాలు ఉన్నాయని రిపోర్టు బహిర్గతం చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా ఉన్న వైష్ణవ సంఘాలు, శ్రీవారి అభిమానులు, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. జరిగిన ఘటనపై దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

Tags

Next Story