CM Chandrababu: తిరుమలలో డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలే జగన్-బాబు

హిందూ సంప్రదాయాలపై నమ్మకంలేనపుడు సీఎం హోదాలో జగన్ తిరుమలకు ఎందుకు వెళ్లినట్లు అంటూ ఏపీ సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. గతంలో జగన్ తిరుమల పర్యటనను ప్రస్తావిస్తూ.. హిందూవేతరులు శ్రీవారి దర్శనానికి వెళ్లినపుడు ముందుగా డిక్లరేషన్ ఇవ్వడం సంప్రదాయమని, అందరూ దానిని పాటిస్తారని గుర్తుచేశారు. అయితే, క్రిస్టియన్ అయిన జగన్ మాత్రం డిక్లరేషన్ ఇవ్వకుండానే శ్రీవారిని దర్శించుకున్నాడని మండిపడ్డారు. శ్రీవారి భక్తుల మనోభావాలను కించపరిచారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో దేవాలయాల్లో జరిగిన ఘటనల పట్ల జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు.
‘‘వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉన్న అన్యమతస్థులు కూడా తిరుమలకు వెళ్లొచ్చు. అయితే, ముందుగా శ్రీవారిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వాలి. అన్యమతస్థులు ఎవరైనా సరే దీనికి అతీతులు కారు. అయితే, జగన్ మాత్రం ఈ పద్ధతిని పాటించలేదు. ప్రజలు అధికారం ఇచ్చింది సంప్రదాయాలకు వ్యతిరేకంగా పనిచేయడానికి కాదు అనే విషయం జగన్ గుర్తించలేదు. సంప్రదాయాన్ని గౌరవించకపోతే తిరుమల ఎందుకు వెళ్లారని ప్రశ్నించినందుకు మమ్మల్ని బూతులు తిట్టారు. రథం కాలిపోతే.. తేనెటీగలు కారణమని అన్నారు. తిరుమల పోటులో అగ్ని ప్రమాదం జరిగితే ఏమవుతుందంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. అందుకే భగవంతుడికి అందరం క్షమాపణ చెప్పాలి. ఇక ఆయనే చూసుకుంటాడు. అపచారం చేసి ఆ అబద్ధాలను నిజాలుగా చేయాలని చూడటం స్వామి ద్రోహం’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com