CBN: అధికారులపై చంద్రబాబు ఆగ్రహం

తిరుమల వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తిస్థాయిలో విఫలమయ్యారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో తొక్కిసలాట ఘటన జరిగిన కేంద్రాలను మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి పరిశీలించారు. భక్తులు పెద్ద సంఖ్యలో టొకెన్లు జారీ చేసే కేంద్రాల వద్దకు వస్తున్నా ఉన్నతాధికారులకు సరైన సమాచారం ఇవ్వలేదని సీఎం... తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉందని భావించినప్పుడు టోకెన్ల జారీ ప్రక్రియను ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు.
టీటీడీ ఈవోపై తీవ్ర ఆగ్రహం
తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. అధికారులను అడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో టీటీడీ అధికారులు, కలెక్టర్‌పై సీఎం సీరియస్ అయ్యారు. ఎందుకు సరిగ్గా ఏర్పాట్లు చేయలేదని ప్రశ్నించారు. పద్దతి ప్రకారం పని చేయడం నేర్చుకోవాలన్నారు. 2వేల మంది పడతారని తెలిసినా, 2,500 మందిని ఎందుకు పంపించారని అధికారులపై మండిపడ్డారు. చంద్రబాబు ఈ ఘటనపై అధికారులపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ ఉన్నతాధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం సమీక్షలోనూ టీటీడీ ఈవో శ్యామలారావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అజాగ్రత్తగా ఉండడం వల్లే ఇంతటి దుర్ఘటన జరిగిందని అన్నారు. టీటీడీని ప్రక్షాళన చేస్తానన్న నమ్మకంతోనే ప్రజలు తమకు ఓట్లు వేశారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం తిరుపతిలో టోకెన్ల పంపిణీ విధానం ప్రవేశపెడితే, దాన్నే నేటికీ ఎందుకు కొనసాగిస్తున్నారని ఈవో శ్యామలరావును ప్రశ్నించారు. మిమ్మల్ని నియమించిందే భక్తుల ఇబ్బందులు తీర్చేందుకు కదా అని నిలదీశారు.
తిరుపతి ఘటనపై చంద్రబాబుకు నివేదిక
తిరుపతి తొక్కిసలాటపై సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రాథమిక నివేదికను అందజేశారు. డీఎస్పీ నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట చోటు చేసుకుందని నివేదికలో పేర్కొన్నారు. తొక్కిసలాట జరిగినా డీఎస్పీ సరిగ్గా స్పందించలేదని, ఎస్పీ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని భక్తులకు సహాయం అందించారని నివేదికలో రాసుకొచ్చారు. తొక్కిసలాట జరిగిన 20 నిమిషాల వరకు అంబులెన్స్ డ్రైవర్ కూడా అందుబాటులోకి రాలేదని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com