CBN: అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం

గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటిస్తున్నానని.. ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ ముందుకు పోతామని ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో జరిగిన యాంటీ నార్కోటిక్స్ డేలో పాల్గొన్న చంద్రబాబు.. డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీని ప్రారంభించారు. గంజాయి సాగుతో దేశాన్ని, ఏపీని నాశనం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడితే ఊరుకోబోమని హెచ్చరించారు. రాజకీయం ముసుగులో రౌడీయిజం చేస్తే తోక కట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. " ఈ రోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.. నేను యువతకు ఒకటే చెబుతున్నా. ఎన్నికలకు ముందు కూడా చెప్పాను. రౌడీల తోక కత్తిరిస్తానని అన్నాను. రాయలసీమలో ముఠా కక్షలు. కుటుంబాలకు కుటుంబాలను చంపే పరిస్థితి. రాయలసీమలో ముఠాకక్షలను పూర్తిగా అణిచివేశాం. మతసామరస్యాన్ని కాపాడుతాం… విద్వేషాలు రెచ్చగొట్టే వారిని వదిలిపెట్టం అని హెచ్చరించారు.. రౌడీయిజాన్ని కంట్రోల్ చేశాం. గంజాయి, డ్రగ్స్ కు బానిస అయితే ఎంతో ప్రమాదం. వారిని బాగు చేయడం కష్టం.. డ్రగ్స్, గంజాయికి రాష్ట్రం కేంద్రంగా మారిందని టీడీపీ ఎన్నోసార్లు చెప్పింది. ఏజెన్సీని గంజాయికి అడ్డాగా మార్చారు" అని చంద్రబాబు విమర్శించారు .గంజాయి ఎవరూ వాడినా వదిలిపెట్టమని తెలిపారు. రాయలసీమలో ముఠాలను అణచివేసిన పార్టీ టీడీపీ అని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో ముఠా కక్షలు ఉండటానికి వీల్లేదని అన్నారు. మారితే మారండి.. మారకపోతే ఏపీలో ఉండే అర్హత లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.
సినీ ప్రముఖులు ముందుకు రావాలి
మద్యం ఆదాయంలో రెండు శాతాన్ని గంజాయి నిర్మూలనకు ఖర్చు చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ అమ్మేవారి ఆస్తులు కూడా జప్తు చేస్తామని హెచ్చరించారు. డ్రగ్స్, గంజాయిపై పోరాడితే టీడీపీ ఆఫీసుపై దాడి చేశారని గుర్తుచేశారు. డ్రగ్స్ నిర్మూలన కోసం సినీ సెలబ్రిటీలు ముందుకురావాలని కోరారు. గంజాయి వేరే ప్రాంతాలనుంచి తీసుకువచ్చి ఏపీలో అమ్మినా వదిలేది లేదని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
ఆడబిడ్డపై దాడి చేస్తే అదే ఆఖరి రోజు
ఆడబిడ్డపై దాడికి పాల్పడితే అదే చివరిరోజు అని చంద్రబాబు హెచ్చరించారు. 26 జిల్లాల్లో నార్కొటిక్ సెల్స్ ఏర్పాటు చేశామని... కాలేజీలలో ఈగల్ క్లబ్బులు ఏర్పాటు చేశామన్నారు. తాను గంజాయి నిర్మూలనకు కృషి చేస్తానని.. మీరు కడా సహకరించాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. “ 1972 నెంబర్‌కు రింగ్ చేయండి.. మీ పేరు కూడా బయటకు రానివ్వం.. కేసులతో గంజాయి సమస్య పరిష్కారం కాదు.. ఆస్తులు కూడా జప్తు చేస్తున్నాం" అన్నారు.. గంజాయి అమ్మినవారి ఆస్తులు కూడా స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. ఏజెన్సీలో గంజాయి పెంచకుండా కఠినమైన చర్యలు చేపట్టామని చంద్రబాబు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com