CBN: చంద్రబాబు అరెస్ట్‌కు నేటికి ఏడాది
వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టయ్యి నేటికి సరిగ్గా ఏడాది. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో మోపిన అక్రమ కేసులో గత ఏడాది సెప్టెంబరు తొమ్మిదో తేదీ తెల్లవారుజామున నంద్యాలలో పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేశారు. పదకొండో తేదీన ఆయనను రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. 53 రోజులు జైల్లో ఉన్న అనంతరం చంద్రబాబు బెయిల్‌పై విడుదల అయ్యారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పరిధిలో అక్రమాలు జరిగాయన్న అభియోగంతో నాటి వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును అరెస్టు చేయించింది. జైల్లో ఆయనకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఆయన గదిలో ఏసీ పెట్టడానికి కూడా ఆయన పార్టీకి చెందిన నేతలు పెద్ద పోరాటం చేయాల్సి వచ్చింది. ఆరోగ్య కారణాలకుతోడు ఈ కేసులో బలమైన సాక్ష్యాలు చూపలేకపోయారన్న అభిప్రాయంతో హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
అదే ప్రథమం
చంద్రబాబు తన రాజకీయ జీవితంలో జైలువాసం గడపడం ఇదే ప్రథమం. రాజకీయ వైరుధ్యాలు ఎన్ని ఉన్నా గతంలోని ఆయన ప్రత్యర్థి ప్రభుత్వాలు ఆయనను అరెస్టు చేసే సాహసం చేయలేకపోయాయి. అప్పటి ముఖ్యమంత్రి జగన్ మాత్రం చంద్రబాబును అరెస్ట్ చేశారు. చంద్రబాబు అరెస్ట్‌తో ఆతర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి బాటలు వేసింది. అప్పటికే పతన దిశలో ఉన్న వైసీపీ మరింత వేగంగా పతనమై అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లకు పరిమితమైంది. ఆ పార్టీ అధినేత జగన్‌కు అసెంబ్లీలో విపక్ష నేతహోదా కూడా లభించలేదు. ఈ పరిణామాలన్నింటి వెనుక చంద్రబాబు అరెస్టు కీలక పాత్ర పోషించింది.
పెల్లుబిక్కిన సానుభూతి
అరెస్టు జన సామాన్యంలో చంద్రబాబు పట్ల సానుభూతి పెల్లుబుకడానికి దారితీసింది. ఆయన జైలు నుంచి విడుదలైన రోజు రోడ్డు మార్గంలో విజయవాడకు వస్తుండగా, స్వాగతం పలకడానికి దారి పొడవునా ప్రజలు వేల సంఖ్యలో ఎదురుచూశారు. విజయవాడ నగరంలో తెల్లవారుజామున చలిలో కూడా మహిళలు, యువత ఆయనకు ఎదురేగి స్వాగతం పలికారు. ఆయన అరెస్టుకు తెలంగాణ, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల్లో కూడా భారీగా నిరసనలు వ్యక్తమయ్యాయి. హైదరాబాద్‌లో నిరసన ప్రదర్శనలను అడ్డుకోవడానికి అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నం, ఆ తర్వాత అక్కడ జరిగిన ఎన్నికల్లో టీడీపీ సానుభూతిపరులు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకడానికి దారితీసింది. దీంతో బీఆర్‌ఎస్ ఓటమి చవిచూసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com