CBN: లక్షల రెట్లు పెరిగిన వైసీపీ నేతల ఆదాయం

CBN: లక్షల రెట్లు పెరిగిన వైసీపీ నేతల ఆదాయం
X
రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన జగన్‌.... అమరావతి, పోలవరాన్ని గాలికొదిలేశారన్న చంద్రబాబు

గత ఐదేళ్ల జగన్‌ పాలనలో ప్రజల తలసరి ఆదాయం పెరగలేదు కానీ వైసీపీ నేతల ఆదాయం మాత్రం లక్షల రెట్లు పెరిగిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులను సర్వనాశనం చేయటం వల్ల రాష్ట్రానికి రావాల్సినంత ఆదాయం సమకూరలేదన్నారు. గత ప్రభుత్వ దుర్మార్గపు చర్యలతో ఏపీలో పెట్టుబడులు సురక్షితం కాదనే అపనమ్మకం పెట్టుబడిదారుల్లో ఏర్పడిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు... పెట్టుబడిదారుల గొంతుపై కత్తి పెట్టి బలవంతంగా ఆస్తులు రాయించుకున్నారని చంద్రబాబు శాసనసభలో అన్నారు. విశాఖలో రామానాయుడు స్టూడియోస్, దసపల్లా భూముల్ని కబ్జా చేశారని తెలిపారు. వీటిన్నింటి వల్ల అభివృద్ధి ఆగిపోయిందని... ఏపీలోని పెట్టుబడులు ఉపసంహరించుకుని పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయారని అన్నారు.

అమరరాజా కార్పొరేట్‌ కార్యాలయం కూడా తిరుపతిలోనే ఉండేదని... అలాంటి ప్రఖ్యాత సంస్థనూ వేధించి మన రాష్ట్రం నుంచి వైసీపీ నేతలు తరిమేశారని చంద్రబాబు అన్నారు. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైన లులూ గ్రూపును వెళ్లగొట్టారని.. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క పెట్టుబడైనా వచ్చిందా అని చంద్రబాబు ప్రశ్నించారు. పెట్టుబడులు లేకపోతే సంపద ఎలా సృష్టిస్తామన్నారు. సంపద లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలు చేస్తామన్నారు. వైసీపీ అరాచక పాలన ఫలితం ఇప్పుడు అనుభవించాల్సి వస్తోందని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు తన దగ్గరకొచ్చి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని అడుగుతున్నా ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. గతంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని... అప్పట్లో ఎమ్మెల్యేలు వినతులు తీసుకొస్తే కాదనకుండా సంతకం పెట్టేవాణ్నినని.. ఇప్పుడు ఆ పని జరగదేమో అని ఆలోచించి మరీ సంతకం పెట్టాల్సి వస్తోందన్నారు.

ఇప్పటి వరకూ విడుదల చేసిన ఏడు శ్వేతపత్రాలపై రాష్ట్రమంతా చర్చిద్దామని పిలుపునిచ్చిన చంద్రబాబు.... వీలైనంత తొందరగా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరిస్తామని తెలిపారు. తప్పులు చేసిన వారందర్నీ శిక్షిస్తామని.. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ప్రకటించారు. వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై తాము శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జగన్‌కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిదని చెప్పాలని సవాల్‌ విసిరారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలని అన్నారు. శాసనసభకు రాకుండా అబద్ధాలు చెబుతూ ప్రజల్ని మభ్యపెడతారా అంటూ చంద్రబాబు నిలదీశారు.

Tags

Next Story