AP Debt: అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్.. మరో 27 వేల కోట్లు..

AP Debt: అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్.. మరో 27  వేల కోట్లు..
X
AP Debt: జగన్ ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇది అందరికీ తెలిసిన నిజం.

AP Debt: జగన్ ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇది అందరికీ తెలిసిన నిజం. అయినా ఎడాపెడా కొత్త అప్పులు చేస్తూనే ఉంది. అలాగే అప్పుల వేటలో వైసీపీ సర్కారు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. ఇక మంగళవారం రిజర్వు బ్యాంక్ వద్ద బాండ్ల వేలం ద్వారా జగన్ సర్కార్ కొత్తగా 2 వేల కోట్లు అప్పు తెచ్చింది. అయితే తెచ్చిన ఆ అప్పును ఓడీ కింద జమ చేసేసుకుంది ఆర్బీఐ.

రాష్ట్ర క్రెడిట్ రేటింగ్ దారుణంగా ఉండడంతో 7.37 శాతం అత్యధిక వడ్డీకి సెక్యూరిటీలను వేలం వేసింది జగన్ సర్కారు. ఇక ఏపీలో పెరుగుతున్న అప్పుల గురించి, సీఎం జగన్ రుణ పరిమితి పెంచాలని కోరిన విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం బయటపెట్టింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదురి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి నాటికి మరో 27 వేల కోట్లు అప్పులు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి కోరిందని తెలిపారు. గతేడాది డిసెంబర్‌లో ఢిల్లీ పర్యటన సందర్భంగా సీఎం జగన్.. కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు. బహిరంగ మార్కెట్లో అప్పులు చేసేందుకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఉన్న పరిమితిని 42 వేల 472 కోట్లకు పెంచాలని జగన్ కేంద్ర ఆర్థిక శాఖకు కోరారని పంకజ్ చౌదురి తెలిపారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి, రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభంపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది. జగన్ ప్రభుత్వం రోజురోజుకు అప్పుల ఊబిలో కూరుకుపోతోందని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. అప్పుల కోసం ప్రభుత్వం అమరావతి భూములను తాకట్టు పెట్టిందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును జగన్ సర్కారు పట్టించుకోవడం లేదని విమర్శించారు.

బడ్జెట్‌ కేటాయింపుపై లోక్‌సభలో జరిగిన చర్చలో భాగంగా రాష్ట్ర అంశాలను లేవనెత్తిన ఎంపీ కేశినేని నాని.. వైసీపీ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటు కాగ్ సైతం ఏపీ అప్పులపై ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంపై అప్పుల భారం పెరుగుతూనే ఉందని.. 2020-2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గతంలోనే ఏపీ అప్పులను కాగ్ తన నివేదికలో పేర్కొంది.

అంచనాల కన్నా 153 శాతం అధికంగా ఏపీ అప్పులు ఉన్నాయని కాగ్ తేల్చి చెప్పింది. ఇన్ని చేసినా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంక్షోభం తప్పదు అని గణాంకాలు స్పష్టంగా చెప్తున్నాయి. కేంద్రం జోక్యం చేసుకోకుంటే రాష్ట్రంలో పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఉందంటున్నాయి విపక్షాలు.

Tags

Next Story