AP Debt News: ఆంధ్రప్రదేశ్ కు రూ.4 లక్షల కోట్ల అప్పు.. ఒక్కొక్కరిపై..

AP Debt News (tv5news.in)
AP Debt News: ఏపీ అప్పులు కుప్పలుగా మారింది. ప్రతినెలా వేలకోట్ల అప్పులు చేయందే పరిపాలన ముందుకు నడిచేలా లేదు. ప్రభుత్వం చేసిన అప్పులు 4లక్షల కోట్లు దాటాయి. బహిరంగ మార్కెట్లో చేసినవి అదనం. వీటికితోడు వివిధ కార్పొరేషన్లపేరిట వేలకోట్లు రుణాలు తీసుకుంది. ఇలా రాష్ట్రంలో ఉన్న కార్పొరేషన్లను అన్నింటిని వాడేసింది. దీంతో కొత్తగా అప్పులు పుట్టడం ఇప్పుడు రాష్ట్రప్రభుత్వానికి గగనంగా మారింది.
ప్రతి నెల ఐదు వేల కోట్లు.. ఇది ఆదాయం కాదు.. అప్పు.. ప్రతినెలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. అప్పులపైనే ఆశలు పెట్టుకుని సర్కారును నడుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే 4 లక్షల కోట్లకు పైగా అప్పుల్లో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. వీటికి తోడు బహిరంగ మార్కెట్లోనూ వేలకోట్ల అప్పులు చేస్తోంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు నెలాఖరు వరకు 33వేల 906 కోట్లు వాడుకోవచ్చని పరిమితిని నిర్ణయించింది కేంద్రం. ఇందులో ఇప్పటికే 31వేల 751 కోట్లను రుణంగా తీసుకుని వాడేసింది జగన్ సర్కారు. ఇక ప్రభుత్వం దగ్గర 2వేల 155కోట్ల రూపాయలే మిగిలున్నాయి. మరోవైపు నెలకు 5వేల కోట్లు అప్పులు చేస్తే గానీ సర్కారు నడిచే పరిస్థితి లేదు.
డిసెంబరు నెలాఖరు వరకు మిగిలిన 2వేల 155 కోట్లను సెక్యూరిటీల వేలం ద్వారా రుణం తీసుకునే వెసులుబాటు ఉండగా.. ఇందులో వెయ్యి కోట్ల రుణానికి ఇప్పటికే రిజర్వు బ్యాంకుకు ఆర్థికశాఖ ప్రతిపాదనలు పంపింది వైసీపీ ప్రభుత్వం. వచ్చే మంగళవారం వేలంలో పాల్గొని వేర్వేరు కాల పరిమితుల్లో తీర్చేలా చెరో 500 కోట్ల రుణం తీసుకుంటోంది.
ఇదీ పూర్తయితే డిసెంబరు నెలాఖరు వరకూ ప్రభుత్వానికి మిగిలేది వెయ్యి 155 కోట్లే. ఈమొత్తంతోనే ఇంకా నవంబరు, డిసెంబరు నెలలు గడవాలి. కొన్నాళ్లుగా నెలకు 5వేల కోట్లు అప్పు తీసుకుంటేనే రాష్ట్రం అవసరాలు తీరుతున్నాయి. 7 నెలల్లో నాలుగు నెలలు ఇలాగే తీసుకుంది ప్రభుత్వం. మరోవైపు అనేక బిల్లులు పెండింగులో ఉన్నాయి.
సర్కారును నడిపేందుకు అప్పుల మీద అప్పులు చేస్తున్న సర్కారు.. ఇప్పటికే కార్పొరేషన్ల పేరిట వేల కోట్ల అప్పులు చేసింది. ఉన్న కార్పొరేషన్లంటినీ వాడేసిన ప్రభుత్వానికి.. కొత్తగా అప్పులు పుట్టడం కూడా కష్టంగా మారింది. మిగిలిన వెయ్యి కోట్లతో పదిరోజులు కూడా గడిచే పరిస్థితి లేదు. మరి కొత్త అప్పుల కోసం సర్కారు ఏ మార్గాలను అన్వేషిస్తుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రప్రభుత్వం రెండో త్రైమాసికంలో ఎంత మూలధన వ్యయం చేసిందో కేంద్ర వ్యయ విభాగం సమీక్షించనుంది. జులై, ఆగస్టు, సెప్టెంబరు నెల లెక్కలు ఖరారైన తర్వాత వీటిపై త్వరలో సమీక్ష చేయనుంది. కేంద్ర ప్రమాణాల ప్రకారం మూలధన వ్యయం ఖర్చుచేస్తే మరికొంత రుణ పరిమితి పెంచే వీలుందని ఎదురుచూస్తోంది వైసీపీ సర్కారు.
ఇటు డిఫాల్టర్‌గా ప్రకటిస్తామంటూ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి హెచ్చరికలు వస్తుండగా.. అటు ఇన్సాల్వెన్సీ కోడ్ ప్రయోగిస్తామని ఆర్‌ఈసీ నుంచి వార్నింగ్‌లు ఇస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.. మళ్లీ అప్పు కోసం ఏపీ ప్రభుత్వం వెతుకులాట మొదలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది..
కేంద్రం పరిధిలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, గ్రామీణ విద్యుదీకరణ సంస్థ అప్పులకు కిస్తీలు చెల్లించడం లేదు.. దీంతో ఆర్‌ఈసీ తన రికార్డుల్లో జెన్‌కో, రాష్ట్ర పవర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్లను నిరర్ధక అకౌంట్ల జాబితాలోకి చేర్చినట్లు ప్రకటించడం అందరిలో ఆందోళన కలిగిస్తోంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికే నేరుగా ఆర్‌ఈసీ లేఖ రాసింది..
ఇలా ఒక ప్రభుత్వ సంస్థను ఎన్‌పీఏలోకి చేర్చడం ఇదే తొలిసారి అంటున్నారు అధికారులు.. తమ బకాయిలు చెల్లించకపోతే డిఫాల్టర్‌గా ప్రకటిస్తామని ఓవైపు పీఎఫ్‌సీ హెచ్చరిస్తుంటే.. ఇన్సాల్వెన్సీ కోడ్ ప్రయోగిస్తామని ఆర్‌ఈసీ వార్నింగ్ ఇస్తోంది.. పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీలకు తక్షణం చెల్లించాల్సిన బకాయిలు 2వేల కోట్లపైనే ఉన్నట్లు తెలుస్తోంది.. ఏపీ ప్రభుత్వానికి తక్షణ అవసరం 2,200 కోట్లు కాగా.. తక్షణం అప్పు చేసే వెసులుబాటు రెండు వేల కోట్లు మాత్రమే ఉంది.. దీంతో బకాయిలు తీర్చేందుకు అధికారులు మార్గాలు అన్వేషిస్తున్నారు.
ఆర్‌ఈసీ నుంచి జెన్‌కో తీసుకున్న రుణాలు 11వేలా 157 కోట్లు.. వీటిలో 405 కోట్లు అక్టోబరు 31 నాటికి ఓవర్ డ్యూస్‌గా మిగిలిపోయాయి.. అలాగే పవర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కూడా తన మొత్తం బకాయిలు 1270 కోట్లలో 141 కోట్లు ఓవర్ డ్యూస్‌గా మిగిలిపోయాయి.. గడువుకు 90 రోజులు దాటినా చెల్లింపులు లేకపోతే ఆ బకాయి పడిన సంస్థను నిరర్ధక అకౌంట్ల జాబితాలోకి చేరుస్తారు..
ఈ నేపథ్యంలోనే ఈ రెండు సంస్థల ఖాతాలను తమ రికార్డుల్లో ఎన్‌పీఏగా నమోదు చేసినట్లు ఆర్‌ఈసీ ప్రకటించింది.. ఒకవేళ బకాయిలు చెల్లించని పక్షంలో ఏపీ జెన్‌కోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డిఫాల్టర్ లిస్ట్‌లో పెట్టే ప్రమాదం ఉంది.. ఇదే జరిగితే ఏ బ్యాంకులోనూ, ఏ రీఫైనాన్సింగ్ సంస్థ నుంచి ఏపీకి ఇక అప్పు పుట్టదంటున్నారు ఆర్థిక నిపుణులు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా చేస్తున్న అప్పులపై వివక్షాలు మొదటినుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సంక్షేమ పథకాలకోసం డబ్బులను పంచడం కాకుండా.. అవసరమైన నిర్మాణాత్మక పథకాలను చేపట్టాలని కోరుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com