PAWAN: ఎర్రచందనం అక్రమ రవాణపై దృష్టి పెట్టండి

PAWAN: ఎర్రచందనం అక్రమ రవాణపై దృష్టి పెట్టండి
X
అటవీ శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో పవన్ భేటీ... కీలక ఆదేశాలు జారీ

ఆంధ్రప్రదేశ్‌ అటవీ శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఎర్రచందనం అక్రమ రవాణా కట్టడిపై ఫోకస్ పెట్టాలని పవన్ ఆదేశించారు. ఇతర దేశాలకు అక్రమంగా ఎర్రచందనం తరలింపుపై పవన్‌ ఆరా తీశారు. నేపాల్ దేశానికి 172 మెట్రిక్ టన్నుల ఎర్ర చందనం అక్రమంగా వెళ్లినట్టు గుర్తించామని అధికారులు వెల్లడించారు. నేపాల్‌కు అక్రమంగా తరలిన ఎర్రచందనాన్ని తిరిగి రప్పించడంపై రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. పొల్యూషన్ ఆడిట్ కచ్చితంగా చేయాలని డిప్యూటీ సీఎం సూచించారు. ఏయే పరిశ్రమల నుంచి ఎంత కాలుష్యం విడుదలవుతుందో సమగ్ర నివేదిక ఇవ్వాలని పవన్‌ ఆదేశించారు. కృష్ణా, గోదావరి నది జలాలు కలుషితంపై ప్రత్యేకంగా సమీక్షిస్తానని పవన్ వెల్లడించారు.

వైసీపీ నేతలు పిరికివారు

వైసీపీ నాయకులు ఓటమిని స్వీకరించలేని పిరికివారని ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు అసెంబ్లీ స్పీకర్‌గా రావడం సంతోషకరమన్నారు. అయ్యన్నపాత్రుడిలో ఇన్ని దశాబ్దాలు ప్రజలు వాడివేడిని చూశారని అన్నారు. ఇకపై ఆయనకు కోపం వస్తే తిట్టడానికి అవకాశం లేదని, అల్లరి పిల్లాడికి క్లాస్‌ లీడర్‌ బాధ్యతలు అప్పచెప్పినట్లయిందని స్పీకర్‌ను ఉద్దేశించి పవన్‌ అనడంతో సభలో నవ్వులు వెల్లివిరిశాయి. ఇన్నాళ్లూ ప్రజలు ఆయన వాగ్ధాటి చూశారని, నేటి నుంచి హుందాతనం చూస్తారని తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగా బూతులు, వ్యక్తిగత దూషణలకు తావివ్వని చర్చలు సాగాలని పవన్‌ అభిలాషించారు. భాష మనసులను కలపడానికే.. విడగొట్టడానికి కాదన్నారు. విభేదించడం అంటే ద్వేషించడం కాదన్నారు. వాదించడమంటే కొట్టుకోవడం కాదని, విభేదించడం, వాదించడం అనేవి చర్చను మరింత ఉన్నత దశకు తీసుకెళ్లేలా ఉండాలని సూచించారు.

శాసనసభలో ప్రతిపక్షం ఉన్నా లేకున్నా నిర్మాణాత్మకంగా సభను నిర్వహిస్తామని పవన్‌ సృష్టం చేశారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి చట్టాన్ని ఇప్పటి వరకు సరిగ్గా ఉపయోగించుకోలేదని తెలిపారు. ఈ చట్టాన్ని ఉపయోగించుకుని వ్యవస్థని సంస్కరించాలని అనుకుంటున్నట్టు తెలిపారు. గెలుపు కోసం కష్టపడ్డామని.. పోరాటాలు చేశామని అందుకే పోటీ చేసిన 21 స్థానాల్లో గెలుపొందామన్నారు. పని చేసుకుంటూ పోతే ఫలితం అదే వస్తుంది. డిప్యూటీ స్పీకర్‌ ఎవరికి ఇస్తారనేది ఇంకా తేలలేదన్నారు.

Tags

Next Story