PAWAN: రాజకీయాల్లో నేరస్థులకు స్థానం లేదు

నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగు పెట్టనివ్వమని ఛాలెంజ్ చేసిన వాళ్లే ఈ రోజు మీ ముందు సభలో అడుగు పెట్టలేకపోయారని.. కర్మ అంత బలంగా ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన రఘురామకృష్ణరాజుకు పవన్ అభినందనలు తెలిపారు. ఆయన పోరాట పటిమను కొనియాడారు. ‘‘ఉండి నియోజకవర్గం నుంచి 56వేల పైచిలుకు ఓట్లతో గెలిచి మీరు అసెంబ్లీకి వచ్చారు. గత ప్రభుత్వం రాజకీయాలను నేరమయం చేసింది. నేరస్థులు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో మొన్నటి వరకూ చూశాం. గత ప్రభుత్వంలో అందరూ ఏదో రకంగా ఇబ్బందులు పడ్డారు. రాజకీయాల్లో నేరస్థులకు స్థానం ఉండకూడదు. దురదృష్టవశాత్తూ 2019లో నేరస్థులు అధికారంలోకి వచ్చారు’’ అని పవన్ అన్నారు. క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి రాజ్యాన్ని ఏలితే ఎవ్వరినైనా బలి చేస్తారని పవన్ కల్యాణ్ అన్నారు. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఉండకూడదని 2014లో వారిని నిలువరించామన్నారు. అయితే 2019లో అలా కుదరలేదని.. ఆ సమయంలో క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ జరిగాయని చెప్పారు. ఆ క్రమంలో సుప్రీంకోర్టు జడ్జీలు, పార్టీల్లోని కార్యకర్తలు, సొంత పార్టీ ఎంపీ అయిన ట్రిపుల్ ఆర్‌ను వారు వదల లేదన్నారు. ఆయన్ని శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా హింసించారని గుర్తు చేశారు. ఆ సమయంలో ట్రిపుల్ ఆర్‌ను అరెస్ట్ చేస్తారనుకున్నాం.. కానీ థర్డ్ డిగ్రీ మెథడ్ వాడడంతో భయం కలిగిందన్నారు. దీంతో తామకు ఆవేదన కలిగిందని చెప్పారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడాం
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదన్న తన కోరిక వల్లే.. నేడు డిప్యూటీ స్పీకర్‌గా మిమ్మల్ని చూస్తున్నామని పవన్ పేర్కొన్నారు. అందరం కలసి ప్రజాస్వామ్యాన్ని కాపాడినందుకు ఈ సభకు ధన్యవాదాలు తెలిపారు. ఇక మీ మాటకు పదనుతోపాటు హస్యం సైతం ఉంటుందన్నారు. నాడు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని తాము బయటకు వచ్చామని వివరించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నిరంతర పహారా కాశామని చెప్పారు. అయితే మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్‌ను కోల్పోకోండి.. అదే సమయంలో ప్రజాస్వామ్యం విలువను సైతం కాపాడాలన్నారు. చట్టసభలలో హుందాతనం పోవడం మూలంగానే మీ ఇళ్లల్లోకి వచ్చి మీ వాళ్లను తిడతాం.. రేపులు చేస్తామన్న వ్యాఖ్యలకు ఆజ్యం పడిందన్నారు. సోషల్ మీడియాలో జరగుతున్న అపసవ్య విధానాలను ఈ సభ ద్వారా సరి చేయాలన్నారు. అలాగే సోషల్ మీడియా అబ్యూస్ ప్రోటెక్షన్ బిల్లు సాధ్యమైనంత త్వరగా రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. హోంమంత్రినే కాదు.. ఇంట్లోని ఆడవాళ్లను సైతం వదలడం లేదు.. ఒక శాడిస్టిగ్‌గా తయారయ్యారన్నారు. మార్పు తెస్తామని ప్రజలు మనపై అపారమైన నమ్మకముంచారని తెలిపారు. మీరు మీ హస్యాన్ని కోల్పోవద్దన్నారు. అదే సమయంలో విలువలను నెలకొల్పుతారని తాను ఆశిస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామకు డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు.
పవన్ కల్యాణ్‌ను కలిసిన శ్రీ శ్రీ రవి శంకర్
మంగళగిరిలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ వెళ్లారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో శ్రీశ్రీ రవిశంకర్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రవిశంకర్‌ను పవన్ కల్యాణ్ శాలువాతో సత్కరించారు. వీరిద్దిరూ పలు విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com