CBN: జగన్ పాలనలో ఏపీ విధ్వంసం

కులం, మతం, ప్రాంతం అనే భావనలు విడనాడి ఆంధ్రప్రదేశ్‌ను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లగలిగే కూటమిని గెలిపించుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రజలను కోరారు. వైసీపీ భూస్వాములు, పెత్తందారుల పార్టీ అయితే.అన్ని వర్గాల పేదలను పైకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశమని చెప్పారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీ విధ్వంసమైందన్న ఆయన ఎన్నికల ముంగిట వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాలను నమ్మి మోసపోవద్దని సూచించారు. కీలక తరుణంలో ఆంధ్రప్రదేశ్ కోసం ప్రజలంతా సంఘటితం కావాలని ఎన్నికలు ఏకపక్షం కావాలని పిలుపునిచ్చారు. ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు, ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటించారు. ముందుగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సభలో పాల్గొన్న ఆయన వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో ఏకపక్షంగా ఆదరించిన రాయలసీమ ప్రాంతాన్ని జగన్ ఐదేళ్లుగా దగా చేశారని విమర్శించారు. సీమలో ఉన్న వెనకబడిన వర్గాలను నిలువునా ముంచేశారని ధ్వజమెత్తారు. ఎమ్మిగనూరు సిద్ధం సభలో జిల్లాకు చెందిన తమ అభ్యర్థులందరూ పేదవాళ్లంటూ జగన్ చెప్పిన మాటలకు కౌంటర్ ఇచ్చారు.
వైసీపీ పాలనలో రివర్స్‌గేర్‌లో 30 ఏళ్లు వెనక్కెళ్లిన ఏపీని తిరిగి పునర్నిర్మించేందుకే బీజేపీతో జతకలిశామని చంద్రబాబు స్పష్టం చేశారు. కూటమిలో ఉన్నా మైనార్టీల ప్రయోజనాల విషయంలో రాజీపడబోమన్న చంద్రబాబు వైసీపీ చేసే దుష్ప్రచారాలను నమ్మవద్దని ముస్లింలకు సూచించారు. సామాజిక న్యాయానికి బ్రాండ్ అంబాసిడర్ తెలుగుదేశం పార్టీ అన్న చంద్రబాబు తమ అభ్యర్థుల్లో బీసీలకు పెద్దపీట వేశామని చెప్పారు. బీసీల DNAలోనే తెలుగుదేశం ఉందన్నారు. సీమలో ఏకపక్షంగా తన సామాజికవర్గానికే సీట్లు ఇచ్చిన జగన్... తాము అన్ని వర్గాలకు మేలు చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తన విద్యార్హతపై అవాకులు, చెవాకులు పేలుతున్న జగన్... ఆయనేం చదివారో చెప్పగలరా అని సవాల్ విసిరారు. తర్వాత ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రసంగించిన చంద్రబాబు ఐదేళ్లైనా వెలిగొండ ప్రాజెక్టు ఎందుకు పూర్తిచేయలేదని జగన్‌ని ప్రశ్నించారు. ఎన్నికల ముందు హడావుడిగా పునరావాసం పూర్తిచేయకుండా కేవలం ప్రచారం కోసం సొరంగాన్ని ప్రారంభించారని ధ్వజమెత్తారు.
మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఎన్డీయే ప్రభుత్వం రావాలని చంద్రబాబు అన్నారు. ప్రజాగళం సభలకు వస్తున్న స్పందన చూస్తుంటే.. ఈ ఎన్నికల్లో వైకాపా చిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు. ప్రతి రోజు బటన్ నొక్కా.. బటన్ నొక్కా అని జగన్ చెబుతున్నారు. బటన్ నొక్కింది ఎంత.. ప్రజాధనం బొక్కింది ఎంత? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైకాపా అరాచకాలపై ప్రజలంతా చర్చించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మేలు చేసే పార్టీ ఏదో.. నష్టం చేసే పార్టీ ఏదో బేరీజు వేయాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com