AP: వైసీపీ బాధితులను ఆదుకోవాలి

AP: వైసీపీ బాధితులను ఆదుకోవాలి
ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘం జేఏసీ చైర్మన్‌ కేఆర్‌ సూర్యనారాయణ విజ్ఞప్తి

వైసీపీ ప్రభుత్వ విధ్వంస పాలనలో అష్టకష్టాలు పడిన వారికి టీడీపీ కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘం జేఏసీ చైర్మన్‌ కేఆర్‌ సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు. తొలి కేబినెట్‌ సమావేశంలోనే జ్యుడీషియల్‌ ప్రివ్యూ కమిషన్‌ను ఏర్పాటు చేసి వైసీపీ బాధితులకు అండగా నిలవాలని కోరారు. తనపైనా, తమ కుటుంబంపైనా, ఉద్యోగ సంఘాలపైనా, వివిధ వర్గాలపైనా వైసీపీ ప్రభుత్వం సాగించిన దౌర్జన్యకాండ పై మండిపడ్డారు. ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన ఆర్థిక చెల్లింపులు సక్రమంగా జరగటం లేదని, రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, జీపీఎఫ్‌, సీపీఎస్‌ సొమ్మును వాడుకున్నారని గవర్నర్‌కు 2023, జనవరి 19న నివేదించామని, ఆ తెల్లవారు నుంచే వైసీపీ ప్రభుత్వం తనతో పాటు ఉద్యోగ సంఘాలను ఊచకోత కోయటం ప్రారంభించిందన్నారు.

సజ్జల రామకృష్ణారెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, ఏపీఎన్‌జీవో సంఘాన్ని అడ్డు పెట్టుకుని తనపై బురద చల్లారని, చివరికి అరెస్టు చేయించేందుకు, చంపించేందుకు కూడా కుట్రలు చేశారని పేర్కొన్నారు. తనపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న కేసులు పెట్టడం, కుదరకపోవటంతో వాణిజ్యపన్నుల శాఖలో జరిగిన అక్రమ బదిలీలను ప్రశ్నించినందుకు 2021లో జరిగిన ఓ ఉదంతాన్ని ఆధారంగా చూపి అరెస్టు చేయాలని చూసిందన్నారు. ‘ఎఫ్‌ఐఆర్‌ పెట్టి ఆరెస్టు చేయాలని చూశారు. నా భార్య, కూతుళ్లను అర్ధరాత్రి వరకూ విచారణ చేసి హింసించారు. నా భార్య మెడలోని నల్లపూసలను కూడా తీయించారు. భయభ్రాంతులకు గురిచేశారు.’ అని ఆవేదన వ్యక్తం చేశారు. తాను గవర్నర్‌ను కలిసిన వెంటనే తన ఫోన్లను పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు ట్యాప్‌ చేయించారని మండిపడ్డారు.

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ను తాను కలిసిన సందర్భంలో కూడా తనపై వేధింపులకు పాల్పడ్డారన్నారు. ఇంటెలిజెన్స్‌ డీజీగా ఉన్న సీతారామాంజనేయులు తనను రెండుసార్లు పిలిపించి, ఏసుపాదం అనే అధికారితో బెదిరించారని తెలిపారు. ‘ముఖ్యమంత్రి దగ్గరకెళ్లి, క్షమాపణలు చెప్పి, ఆందోళనలను విరమించకపోతే నిన్ను భగవంతుడు కూడా కాపాడలేడు.’ అని బెదిరించారని పేర్కొన్నారు. ‘సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం దానిని అమలు చేయలేదు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సీపీఎస్‌ రాజ్యాంగ విరుద్ధమైన అంశంగా నేను మాత్రమే గ్రహించాను. హైకోర్టులో చాలెంజ్‌ చేస్తానని కూడా చెప్పాను. ఉద్యోగుల జీపీఎఫ్‌ సొమ్ము రూ.500 కోట్లను వారి సమ్మతి లేకుండా సొంత అవసరాలకు వాడుకోవటంపై ఆర్థికశాఖ అధికారులైన ఎస్‌ఎస్‌ రావత్‌, కేవీవీ సత్యనారాయణపై క్రిమినల్‌ కేసులు పెడతానని హెచ్చరించాను. దీంతో వైసీపీ ప్రభుత్వం కక్షగట్టింది’ అని పేర్కొన్నారు.

Tags

Next Story