AP Employees : జగన్‌ ప్రభుత్వానికి 18 ప్రశ్నలు సంధించిన ఉద్యోగులు

AP Employees : జగన్‌ ప్రభుత్వానికి 18 ప్రశ్నలు సంధించిన ఉద్యోగులు
AP Employees : జగన్‌ సర్కార్‌పై ప్రభుత్వ ఉద్యోగులంతా నిప్పులు కురిపిస్తున్నారు. ప్రభుత్వానికి 18 ప్రశ్నలు సంధించారు.

జగన్‌ సర్కార్‌పై ప్రభుత్వ ఉద్యోగులంతా నిప్పులు కురిపిస్తున్నారు. ఎన్నికల ముందు పీఆర్సీ, సీపీఎస్‌ రద్దుపై హామీలిచ్చి... ఇప్పుడు అన్నింటిలోనూ కోతలు పెట్టడంపై మండిపతుడున్నారు. ప్రభుత్వానికి 18 ప్రశ్నలు సంధించారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ను రద్దు చేస్తామని చెప్పిన మాట ఎందుకు తప్పారని ప్రశ్నిస్తున్నారు. సకాలంలో మెరుగైన పీఆర్‌సీ, పెండింగ్ లేకుండా డిఏలు ఇస్తామన్న హామీలు ఏమైయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన 43 ఫిట్‌మెంట్ ఎక్కువా?మీరిచ్చిన 23 ఎక్కువా? అని ఎద్దేవా చేస్తున్నారు.

హెచ్‌ఆర్‌ఎలను ఎందుకు తగ్గించారని, ఇంటి అద్దెలు సంవత్సరం సంవత్సరం పెరుగుతాయా తగ్గుతాయా? అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు 20శాతం ఐఆర్ ఇస్తే, ఈ 20 శాతంతో ఉద్యోగులు ఎలా బ్రతుకుతారని విపక్షంలో ఉండగా నిలదీసిన జగన్‌... తాను అధికారంలోకి వచ్చిన వెంటనే 27శాతం ఐఆర్, దానికి మించి పిఆర్సీ ఇస్తానని హామీ ఇచ్చారా లేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఇచ్చిన ఐఆర్‌ని కూడా తగ్గించి 23శాతం ఫిట్ మెంట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని, ఇలా ఐఆర్ కంటే తక్కువ ఫిట్‌మెంట్ ఇచ్చిన చరిత్ర ఏపీలో ఎపుడూ లేదని ఉద్యోగులు వాపోతున్నారు.

చంద్రబాబు ఇచ్చిన ఐఆర్ 20శాతాన్ని 2019 ఏప్రిల్, మే, జూన్ నెలలు మీరు ఎగ్గొట్టింది నిజం కాదా? అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. పాదయాత్రలో ఉద్యోగులకు మీరు ఇచ్చిన హామీలు ఏమిటి? ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి? అని నిలదీస్తున్నారు. పదో పిఆర్సీలో 43శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన చంద్రబాబుని కాదని 2019 ఎన్నికల్లో ఉద్యోగులంతా వన్‌సైడ్‌గా ఓట్లు వేసి మిమ్మల్ని గెలుపించుకున్నది జీతాలు కోతవేయించుకోవడానికా? అని అంటున్నారు. జీతాలకు సింహభాగం ఖర్చవుతోందని ప్రభుత్వం చెబుతున్న కాకిలెక్కలు సరైనవి కావంటున్నారు ఉద్యోగులు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, సలహాదారులు, వారి అనుచరగణం జీత భత్యాలు.. మాజీ ప్రజాప్రతినిధుల పెన్షన్లు... జెడ్పీ చైర్మన్స్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ లు, వివిధ శాఖల కార్పొరేషన్ల చైర్మన్ల జీతభత్యాలు... రాజకీయ సలహాదారుల జీతాలు, అలవెన్సులు.. ఇలాంటివన్నీ తీసివేసి అప్పుడు ఉద్యోగుల జీతాల ఖర్చులు గురించి చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించవద్దని కోరుతున్నారు. ఆర్థిక ఇబ్బందులని చెబుతున్న ప్రభుత్వం.. పనికిలేని నియామకాలతో దుబారా ఖర్చులు ఎందుకు పెడుతోందని నిలదీస్తున్నారు.

ఉద్యోగ వ్యతిరేక నూతన పీఆర్సీని వెంటనే రద్దు చేయాలని తిరుపతి రుయా ఆసుపత్రి ముందు పారా మెడికల్‌ సిబ్బంది ఆందోళనకు దిగారు. ఎన్నికల ముందు సీపీఎస్‌ రద్దు చేస్తామని, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ హామీ ఏమైదని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం మొండికి వైఖరిని ఖండించారు. హామీలు అమలు చేయకుండా జీతాలలో కోతలు విధిస్తారా అని ఏపీ మెడికల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిబాబు మండిపడ్డారు.

ఏపీలో జగన్‌రెడ్డి పాలన అన్ని వర్గాల వారిని పట్టిపీడిస్తోందన్నారు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి. ఉద్యోగుల్ని జగన్‌రెడ్డి నమ్మించి మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రివర్స్‌ పీఆర్సీతో ప్రతినెల ప్రభుత్వానికి 750 కోట్ల ఆదాయం మిగిలుతున్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు ఏపీలో ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. ఉద్యోగులు ఏ పార్టీని అంటరానితనంగా కూడా చూడాల్సిన అవసరంలేదన్నారు. అయితే ఎవరు తమను రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారో అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

మరోవైపు సీఆర్సీ జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై సోమవారం విచారణ చేయనున్నట్లు ధర్మాసనం తెలిపింది. సర్వీస్ బెనిపిట్స్ తగ్గించడంపై ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ అధ్యక్షుడు కే.వీ కృష్ణయ్య పిటిషన్‌ను దాఖలు చేశారు. విభజన చట్టం ప్రకారం ఎలాంటి బెనిపిట్స్‌ తగ్గకూడదన్న నిబంధన ఉందని ఇందులో పేర్కొన్నారు. సెక్షన్ 78 (1)కి విరుద్ధంగా ఉన్న జీవో 1ని రద్దుచేయాలని ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో వెల్లడించారు. దీనిపై ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, ఫైనాన్స్, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీలు, కేంద్ర ప్రభుత్వం, పే-రివిజన్ కమిషన్‌ను చేర్చింది.

Tags

Read MoreRead Less
Next Story