AP Employees : సమ్మెకు వెళ్లాలని నిర్ణయించుకున్న ఏపీ ఉద్యోగులు..!

AP Employees :  సమ్మెకు వెళ్లాలని నిర్ణయించుకున్న ఏపీ ఉద్యోగులు..!
AP Employees : ఏపీ ఉద్యోగులు సమ్మెకే వెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎస్‌ సమీర్‌ శర్మను కలిసి సమ్మె నోటీసు ఇస్తున్నట్లు తెలిపింది

AP Employees : ఏపీ ఉద్యోగులు సమ్మెకే వెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎస్‌ సమీర్‌ శర్మను కలిసి సమ్మె నోటీసు ఇస్తున్నట్లు తెలిపింది పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్‌ కమిటి. విజయవాడలో రెవెన్యూ భవన్‌లో పీఆర్సీ స్టీరింగ్‌ కమిటీ సమావేశమై... సుధీర్ఘంగా చర్చలు జరిపింది. సమ్మె నోటీసు, ఉద్యమ కార్యాచరణపై చర్చించిన స్టీరింగ్‌ కమిటీ సభ్యులు....సీఎస్‎కు సమ్మె నోటీస్ ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ప్రతి జిల్లాకు ప్రతి జేఏసీ తరపున ఒక్కో రాష్ట్రస్థాయి నాయకుడిని పంపాలని నిర్ణయించారు.

ఉద్యమం విజయవంతం చేయడానికి నలుగురు నేతల్ని పంపాలని తీర్మానించారు. రోజూ జిల్లాల్లో జరిగిన ఉద్యమంపై రాష్ట్రస్థాయి నాయకులు నివేదిక ఇస్తారని తెలిపారు. ఆయా జిల్లాల్లో పీడీఎఫ్ ఎమ్మెల్సీ‎లను కలుపుకుని ఉద్యమం చేయాలని నిర్ణయించారు. ఈ భేటీలో ఉద్యోగ సంఘాల అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ, శివారెడ్డితో సహా 11 మంది హాజరయ్యారు.

చీకటి జీవోలను ఇచ్చి ఉద్యోగులను మోసం చేసిందని ఆరోపిస్తున్న ఉద్యోగ సంఘ నేతలు..... చీకటి జీవోలను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. హెచ్‎ఆర్‏ శాబ్లో పాత పద్ధతిలోనే ఉద్యోగులకు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. పీఆర్సీకి డీఏ‌కి ఎలాంటి సంబంధం లేదని, జీతం పెరిగిందని రుజువు చేస్తే కార్యాచరణ ఆపడానికి కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. పాత పీఆర్సీనే అమలు చేసి డీఏలు చెల్లించాలని పాత పద్ధతిలోనే 11వ పీఆర్సీ అమలు కోసం పోరాడాలని నిర్ణయించారు.

ఇప్పటికే కార్యచరణ ప్రకటించారు ఉద్యోగ సంఘాల నేతలు. ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్లు వెల్లడించారు. దశల వారీగా ఆందోళనలు చేపడుతామన్నారు. ఈ నెల 25న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు, సచివాలయంలోనూ ప్రత్యేక నిరసన, 26న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంబేద్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు, 27 నుంచి 30వ తేదీ వరకు నాలుగు రోజులు అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. ఫిబ్రవరి 3న చలో విజయవాడ, ఫిబ్రవరి 5న ఉద్యోగులు సహాయ నిరాకరణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. 6వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెలోకి ఉద్యోగులు వెళ్లనున్నారు.

ఓ వైపు పీఆర్సీ సాధన సమితి నేతలతో చర్చలు జరుపుతుండగా....ఉద్యోగ నేతల్ని చర్చలకు ఆహ్వానించింది జగన్‌ సర్కారు. ఉద్యోగ సంఘాల నేతలకు మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని ఫోన్‌ చేసి సంప్రదింపులకు రావాలని పిలించారు. సమ్మె నోటీసు ఇవ్వొద్దని.. సామరస్య పూర్వకంగా ప్రభుత్వంతో సంప్రదింపులకు రావాలని ఆహ్వానించారు. అయితే.. ఈ ప్రతిపాదనను తిరస్కరించారు ఉద్యోగ సంఘాల నేతలు. చీకటి పీఆర్సీ జీవోలను రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని తేల్చి చెప్పారు. ఈ భేటీలో ప్రభుత్వంతో చర్చలకు వెళ్లకూడదని మెజార్టీ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

అటు... ఈ ఉద్యమానికి హెల్త్ అడ్మినేస్ట్రేటివ్‌ సర్వీసు ఉద్యోగస్తులు మద్దతిచ్చారు. దీంతో కరోనా, ఇతర వైద్య సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగస్తులు సైతం ఉద్యమంలో పాల్గొంటున్నట్లు ప్రకటించడంతో ప్రజారవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story