AP: అప్పుల్లో ఏపీ సరికొత్త రికార్డు

ఆంధ్రప్రదేశ్ అప్పులు తేవడంలో తన రికార్డును తానే తిరగరాస్తోంది. ఏటికేడు లక్షల కోట్లు అప్పులు చేస్తోంది. అది ఎంతలా అంటే... కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లోనే
ఏకంగా 21 వేల కోట్ల అప్పు చేసింది. వీటిని బహిరంగ మార్కెట్ నుంచి తెచ్చింది. ఈ లెక్క ఇలాగే సాగిపోతే... బహిరంగ రుణమే ఏడాదికి లక్ష కోట్లు దాటిపోనుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం కనీవినీ ఎరగని రీతిలో అప్పులు చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరం బకాయిలనూ కొత్త ఏడాది చెల్లించేలా ఆర్థికశాఖ అధికారులు ప్రణాళిక రచించడంతో తొలి రెండు నెలల్లోనే విచ్చలవిడి అప్పులకు పచ్చజెండా ఊపేశారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లోనే బహిరంగ మార్కెట్ రుణం మొత్తం 21వేల కోట్లకు చేరిపోయింది. ఈ స్థాయిలో రిజర్వుబ్యాంకు నుంచి రుణాలు తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది. గతంలో సగటున నెలకు 5,000 కోట్లకు మించి రుణాలు తీసుకున్న సందర్భాలు లేవు. జగన్ సర్కార్‌లో నెలకు అవి 7,000 కోట్లకు చేరి రికార్డు సృష్టించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా నెలకు 10వేల కోట్లు రుణాలు సమీకరించడం గమనార్హం. ఏప్రిల్‌లో 10వేల కోట్లే రికార్డు అనుకుంటే మే నెలలో దాన్ని 11వేల కోట్లకు చేర్చారు. ఇలా అయితే ఏడాది మొత్తానికి ఒక్క బహిరంగ మార్కెట్ రుణమే లక్ష కోట్లకు మించిపోనుంది.
మార్చి నెలాఖరులో రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకుకు ఇండికేటివ్ క్యాలెండర్ పంపింది. తొలి మూడు నెలల్లో ఏ వారం ఎంత రుణం తీసుకోనున్నారో తెలియజేసింది. ఏప్రిల్‌లో 13వేల కోట్లు, మే నెలలో 5,000 కోట్లు రుణం తీసుకుంటామని రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలే విస్మయం కలిగించాయి. కానీ వాస్తవానికి 21వేల కోట్ల మేర అప్పులు పుట్టిస్తున్నారు. ఈ నెలలో చివరి మంగళవారం మే 28న మరో 2వేల కోట్ల రుణం కావాలని ఆర్‌బీఐకి ప్రభుత్వం వర్తమానం పంపింది. అదీ కలిపితే ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో అప్పు 21 వేల కోట్లకు చేరిపోతుంది.
కేంద్రం ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ తొలి తొమ్మిది నెలలకు రుణపరిమితి నిర్ణయిస్తుంది. ఈసారి తొలి ఆరు నెలలకే అనుమతులు ఇచ్చింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంచనాల ఆధారంగా ఈ అప్పుల మొత్తం తేలుస్తారు. స్థూల ఉత్పత్తి మొత్తాన్ని పెంచి చూపి, అదనపు అప్పులకు అనుమతులు సంపాదిస్తున్న ఉదంతాలూ ఉన్నాయి. కిందటి ఆర్థిక సంవత్సరం చెల్లింపులను చాలావరకు జగన్ ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచేసింది. కొత్త ఏడాది అప్పులతో వాటిని చెల్లించవచ్చనే ప్రణాళికే ఇందులో భాగం. వివిధ డీబీటీ పథకాలకు 14వేల కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇవ్వాలనే ప్రణాళిక రూపొందించినట్లు ప్రభుత్వమే అంగీకరించింది. కేంద్రం ఆరు నెలల్లో 47 వేల కోట్ల రుణ అనుమతులు ఇచ్చింది. ఆ లెక్కన నెలకు సగటున 8వేల కోట్ల వరకు రుణం తీసుకునే అవకాశం ఉంది. అంతకుమించి పోయి మరీ అప్పులు తెస్తుండటం గమనార్హం.మరోవైపు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి సొంత పన్నుల రూపంలో వచ్చిన రాబడి లక్ష 30వేల కోట్ల వరకు ఉంది. అంటే సగటున నెలకు 10వేల800 కోట్లు. పన్నుల రాబడికి మించిపోయి మరీ అప్పులు తెస్తున్న ప్రభుత్వం వాటిని తీర్చే మార్గాలను మాత్రం అన్వేషించట్లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com