AP: కొత్త వైరస్ పై ఏపీ టాస్క్ ఫోర్స్ కమిటీ

భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదవుతున్న వేళ ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. గుజరాత్, కర్ణాటకల్లో కేసులు నమోదైన వేళ.. మైక్రో బయాలజిస్ట్‌లు, పీడియాట్రిషియన్లు, పల్మనాలజిస్టులు, ప్రివెంటివ్ మెడిసిన్ నిపుణులతో టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటివరకూ ఏపీలో ఎలాంటి కేసులు నమోదు కాకపోయినా ముందు జాగ్రత్త చర్యగా టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఆరోగ్యమంత్రి సమీక్ష
హ్యుమాన్ మెటానిమో వైరస్ కేసుల వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైనట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు.రాష్ట్రానికి వైరస్ వల్ల ఎలాంటి ముప్పు లేదని ఇప్పటికే ICMR ప్రకటించిందని స్పష్టం చేశారు. నూతన వైరస్ పై వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించినట్లు మంత్రి చెప్పారు. ఈ క్రమంలో కావాల్సిన వైద్య పరికరాలను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. పరీక్షలు నిర్వహించేందుకు ల్యాబ్‌లను కూడా సిద్ధంగా ఉంచామన్నారు. యాంటీ డ్రగ్ డోస్ మందులు కూడా సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో నూతన ప్రొటోకాల్ అమలు చేస్తున్నాం అని మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
భయమేమీ వద్దు: చంద్రబాబు
హెచ్ఎంపీ వైరస్ 2001 నుంచే ఉందని, కానీ వ్యాప్తి తీవ్రత చాలా తక్కువని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తీవ్రమైన ఊపిరి సంబంధ సమస్యలు ఈ వైరస్ వల్ల రావని, ఇప్పటివరకూ ఏపీలో ఒక్క కేసూ నమోదు కాలేదని చంద్రబాబు తెలిపారు. వైరస్ వ్యాప్తి ఉద్ధృతి చాలా స్వల్పంగా ఉన్నందున అప్రమత్తత అవసరం లేదని ఆయన చెప్పారు.
చైనా కొత్త వైరస్ కు ట్రీట్మెంట్ ఉందా..?
చైనాలో పుట్టిన హెచ్‌ఎంపీవీ వైరస్ కు ప్రత్యేక చికిత్స అంటూ ఇప్పటి వరకైతే ఏదీ లేదని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రతినిధులు వెల్లడించారు. కాకపోతే కోవిడ్ 19కు తీసుకున్న విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని డబ్ల్యుహెచ్ఓ సహా వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వైరస్ సోకినట్లు అనుమానం వస్తే దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలని వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com