AP Employees : ప్రభుత్వ ఉద్యోగులకు జగన్‌ సర్కారు మరో షాక్..

AP Employees : ప్రభుత్వ ఉద్యోగులకు జగన్‌ సర్కారు మరో షాక్..
AP Employees : ప్రభుత్వ ఉద్యోగులకు జగన్‌ సర్కారు మరో షాకిచ్చింది. ఆర్థికశాఖ ఆదేశాలతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.

AP Employees : ప్రభుత్వ ఉద్యోగులకు జగన్‌ సర్కారు మరో షాకిచ్చింది. ఆర్థికశాఖ ఆదేశాలతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. తాజాగా విధించిన నిబంధనలతో... ఫిబ్రవరి నెల జీతాలు అందుతాయో లేదోనన్న 'సస్పెన్స్‌' నెలకొంది. ఆర్థికశాఖ ఆదేశాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 4లక్షల 96వేల 675 మంది ఉద్యోగులకు సంబంధించిన పే స్లిప్పులను 44వేల మంది DDOలు కేవలం ఐదు రోజుల్లో పరిశీలించాల్సి ఉంది. వాటిలో తప్పొప్పులు సవరించి, రికవరీలు లెక్కచూసి కొత్త పే స్లిప్పులు సిద్ధం చేసి ఆ మొత్తాలను సస్పెన్స్‌ ఖాతాకు ట్రాన్స్‌ఫర్‌ చేయాలి. అప్పుడే ఫిబ్రవరి జీతాలు అందుతాయి. ఈ మొత్తం ప్రక్రియను ఈనెల 21 నుంచి 25లోపు పూర్తి చేయాలి. లేకపోతే మార్చిలో సప్లిమెంటరీ బిల్లులు పెట్టే అవకాశం కూడా ఉండదని.... ఆర్థికశాఖ ప్రధాన కార్యదర్శి రావత్‌ DDOలకు ఇచ్చిన మెమోలో స్పష్టం చేశారు. ఈ ఆదేశాలపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

.కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల పాత వేతనాల్లో IR, HRA, CCA రికవరీలు విధించి కొత్తగా లెక్కించాలి. వీటన్నింటికీ దాదాపు నెల పడుతుందని, అలాంటిది 5 రోజుల్లో చేయడం ఎలా సాధ్యమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రతినెలా 25వ తేదీలోపు బిల్లు పెట్టడం కుదరకపోతే తర్వాతి నెలలో 5వ తేదీ నుంచి సప్లిమెంటరీ బిల్లులు పెట్టుకోవచ్చు. కానీ, ఈ నెలలో ఆ నిబంధన ఎత్తేశారు. అంటే ఐదు రోజుల్లో DDOలు 4లక్షల 96వేల 675 వేతనాల బిల్లుల్లో ఎన్నింటిని సరిచేసి సస్పెన్స్‌ ఖాతాకు పంపించగలిగితే అంతమందికే మార్చిలో జీతాలు అందుతాయి. ప్రభుత్వం మళ్లీ సప్లిమెంటరీ బిల్లులు పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తేనే మిగిలిన వారికి వేతనాలు అందుతాయి. ఈ ఆదేశాల ప్రకారం డెడ్‌లైన్‌లోగా అంటే 25లోగా బిల్లులు పెట్టకపోతే ఆ వేతనాలు ఎప్పుడు అందుతాయో, ఇందుకు ఎంత సమయం పడుతుందో ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదు. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరులో తమకు కావాల్సిన బిల్లుల చెల్లింపులు చేసుకునేందుకే... తమ వేతనాల్లో మెలిక పెట్టిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

సస్పెన్స్‌ ఖాతా నుంచి జీతాలు రివర్స్‌ పీఆర్సీని వెనక్కి తీసుకోవాలంటూ ఉద్యోగులంతా జనవరిలో ఉద్యమం చేశారు. కొత్త పీఆర్సీ ప్రకారం బిల్లులు పెట్టబోమంటూ ట్రెజరీ ఉద్యోగులు, DDOలు సహాయ నిరాకరణ చేశారు. దీంతో డీడీవోలకు ఉండే వేతనాల బిల్లుల అధికారాలను DTA, PAOలకు బదిలీ చేస్తూ జీవో ఇచ్చారు. రెగ్యులర్‌గా ఇచ్చే జీతాల హెడ్‌ నుంచి కాకుండా కొన్ని అరుదైన సందర్భాల్లో మాత్రమే వాడే సస్పెన్స్‌ ఖాతా నుంచి జీతాలిచ్చారు. కానీ, ఏ ఉద్యోగికీ సరైన వేతనం పడలేదు. జనవరి నెలకు సంబంధించి ఉద్యోగులందరికీ ఇంకా పేస్లిప్పులు అందనేలేదు. ఇప్పుడు DDOలు వాటిని సరిచేసి 5 రోజుల్లోగా కొత్తవి రూపొందించాల్సి ఉంది.

వాస్తవానికి సస్పెన్స్‌ ఖాతాను వాడొద్దంటూ రాష్ట్రాల ఆర్థిక శాఖలను కాగ్‌ హెచ్చరిస్తూనే ఉంటుంది. ఏదైనా రాష్ట్రం సస్పెన్స్‌ ఖాతా ద్వారా లావాదేవీలు నిర్వహించడమంటే నిబంధనలు ఉల్లంఘించినట్టే. సస్పెన్స్‌ ఖాతా వాడిన ప్రతిసారీ కాగ్‌ వివరణ అడుగుతుంది. ఈసారి కూడా ప్రభుత్వాన్ని కాగ్‌ వివరణ కోరే అవకాశాలున్నాయి. జీతాల కోసం సస్సెన్స్‌ ఖాతా వాడటం వల్ల ఆ ఖాతాలో నిధులు మైన్‌సల్లోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు ఆ లోటును పూడ్చటానికే DDOలంతా సరిచేసిన వేతనాల మొత్తాన్ని సస్పెన్స్‌ ఖాతాకు ట్రాన్స్‌ఫర్‌ చేయాలని ఆదేశాలిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story