AP Government : ఏపీ ప్రజలపై మరో భారం వేస్తున్న జగన్ ప్రభుత్వం

AP Government :  ఏపీ ప్రజలపై మరో భారం వేస్తున్న జగన్ ప్రభుత్వం
AP Government : కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి 24 గంటలు కూడా గడవక ముందే పిడుగులాంటి వార్త చెప్పింది జగన్ ప్రభుత్వం.

AP Government : కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి 24 గంటలు కూడా గడవక ముందే పిడుగులాంటి వార్త చెప్పింది జగన్ ప్రభుత్వం. కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాల్లోని భూముల మార్కెట్‌ విలువ పెంచుతున్నట్టు ప్రకటించింది. పది, ఇరవై శాతం కాదు.. కొన్నిచోట్ల ఏకంగా 430 శాతం, 450 శాతం మార్కెట్‌ విలువ పెంచబోతున్నట్టు తెలుస్తోంది. అసలు కొత్త జిల్లా ఏర్పాటు కాకముందే గత ఫిబ్రవరిలో నరసరావుపేటలో భూముల విలువను వంద శాతం పెంచేసింది. ఇక రేపటి నుంచి కొత్తగా పెంచుతున్న భూముల ధరలు అమల్లోకి వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులను స్పెషల్ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ విడుదల చేశారు. ఇప్పటికే పెరిగిన కరెంట్ ఛార్జీలు, ఆస్తి పన్ను, చెత్త పన్నుల భారాన్ని భరించలేకపోతున్న ఏపీ ప్రజలు.. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీల భారాన్ని మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రేపటి నుంచి భూముల మార్కెట్‌ విలువ పెంచుతామని ప్రకటించిన జగన్ ప్రభుత్వం.. ఎంత చొప్పున ఉంటాయన్నది చెప్పలేదు. మరికాసేపట్లో దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశం ఉందంటున్నారు అధికారులు. అయితే, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ శాఖ మాత్రం కొన్ని ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. దీని ప్రకారం.. తిరుపతి జిల్లాలోని రేణిగుంట పరిధిలో మార్కెట్‌ విలువను 432 శాతం పెంచబోతున్నట్టు సమాచారం. పారిశ్రామికవాడ అయిన రేణిగుంట మండలం అనగుంటలో ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం ఎకరం ఏడున్నర లక్షలు ఉంది. దీన్ని 40 లక్షలకు పెంచేందుకు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనే అమల్లోకి వస్తే గనక మార్కెట్‌ విలువ ఏకంగా 432 శాతం పెరుగుతుంది. ఇక ఎర్రగుంట పరిధిలో ప్రస్తుత మార్కెట్‌ విలువ ఎకరాకు 9 లక్షలపైనే ఉంది. ఇక్కడ మార్కెట్ విలువను 50 లక్షలకు ప్రతిపాదించారు. అంటే, 455 శాతం పెంచేందుకు సిద్ధమవుతున్నారు.

నంద్యాలలో 25 శాతం, చుట్టుపక్కల గ్రామాల్లోని వ్యవసాయ భూముల మార్కెట్‌ విలువను 35 శాతం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాకేంద్రాల్లో 20 నుంచి 25 శాతం వరకు మార్కెట్‌ విలువ పెంచాలని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఇక అనకాపల్లి, దాని చుట్టుపక్కల ఏరియాలో 20 నుంచి 40 శాతం మధ్య మార్కెట్‌ విలువ పెంచాలని ప్రతిపాదించారు. విజయవాడ, ఎన్టీఆర్‌ జిల్లాకేంద్రం చుట్టుపక్కల 15 శాతం వరకు పెంపు ఉండబోతున్నట్టు తెలుస్తోంది. భూములకు డిమాండ్‌ బాగున్న చోట కాస్త ఎక్కువగానే మార్కెట్‌ విలువ పెంచాలని ప్రతిపాదించినట్టు సమాచారం అందుతోంది. ఇవాళ వచ్చే ఉత్తర్వుల్లోనూ దాదాపు ఇవే ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి.

కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆయా జిల్లా కేంద్రాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటుందని జగన్ ప్రభుత్వం అంచనా వేసింది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. కొత్త జిల్లాలు ఏర్పాటైన కొన్ని గంటల్లోనే భూముల మార్కెట్ విలువ పెంచుతూ నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్.

Tags

Read MoreRead Less
Next Story