AP New Collectors: కొత్త జిల్లాల నేపథ్యంలో భారీ ఎత్తున అధికారుల బదిలీలు..

AP New Collectors: రాష్ట్రంలో కొత్త జిల్లాలు సోమవారం నుంచి అమల్లోకి వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం శనివారం రాత్రి భారీ ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. 26 జిల్లాలకు కలెక్టర్లను, సంయుక్త కలెక్టర్లను, ఎస్పీలను నియమించింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల కలెక్టర్లలో నలుగురు తప్ప మిగతా 9 మందినీ వారు పని చేస్తున్న చోటే కలెక్టర్లుగా కొనసాగించింది.
గుంటూరు, కృష్ణా, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్లుగా ఉన్న వివేక్ యాదవ్, నివాస్, ప్రవీణ్ కుమార్, హరికిరణ్‌లను రాష్ట్రస్థాయి పోస్టుల్లోకి బదిలీ చేసింది. ప్రస్తుతం జేసీలుగా, మున్సిపల్ కమిషనర్లుగా, వివిధ రాష్ట్ర స్థాయి పోస్టుల్లో పని చేస్తున్న ఐఏఎస్ అధికారుల్లో కొందరిని జిల్లాల కలెక్టర్లుగా నియమించింది. కొన్ని జిల్లాల సంయుక్త కలెక్టర్లను వారు పని చేస్తున్న చోటే కొనసాగించింది.
ప్రస్తుతం జిల్లాల్లో జేసీ -హౌసింగ్, జేసీ గ్రామ, వార్డు సచివాలయాలుగా పని చేస్తున్న వారిలో పలువురిని కొత్త జిల్లాలకు జేసీలుగా నియమించింది. అటు పలువురు ఐఏఎస్ అధికారుల్ని సైతం ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీ అయినవారిలో పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులున్నారు.
రవాణాశాఖ కమిషనర్‌గా కాటమనేని భాస్కర్‌ను, CRDA కమిషనర్‌గా వివేక్ యాదవ్‌ను, వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌గా చేవూరి హరికిరణ్‌ను, వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్‌గా జె.నివాస్‌ను, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా ఎన్.చక్రవర్తిని నియమించింది.
దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జి.వాణీమోహన్‌ను యువజన వ్యవహారాలు, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. శనివారం అర్ధరాత్రి వరకూ ప్రభుత్వ గెజిట్‌లో జీవోల్ని అధికారికంగా అప్‌లోడ్ చేయలేదు. చివరి నిమిషంలో ఈ జాబితాలో కొన్నిమార్పులు ఉండే అవకాశం లేకపోలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com