AP HIGH COURT: మరోసారి కోర్టులో వైసీపీకి బిగ్ షాక్

పులివెందుల, ఒంటిమిట్టల్లో తెలుగుదేశం పార్టీని ఓడించేందుకు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఆ రెండు ప్రాంతాల ప్రజలు సైకిల్ వైపు నిలిచారు. దీంతో ఫ్యాన్ కొట్టుకుపోయింది. టీడీపీ విజయకేతనం ఎగురవేయగా వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అయినా ఆ పార్టీ నాయకులు వెనక్కి తగ్గేదిలేదని పోరాటం చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఆ పోరాటం నుంచి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కోర్టు తీర్పు పెట్టుకున్న ఆశలు సైతం గల్లంతయ్యాయి. దీంతో రెండు చోట్ల ఓటమిని ఒప్పుకోక తప్పసరి పరిస్థితి ఆ పార్టీది అయింది. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లో అక్రమాలు జరిగాయని వైసీపీ నేతలు ఆరోపించారు. పులివెందుల, ఒంటిమిట్టలో రీపోలింగ్ నిర్వహించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. రీపోలింగ్ విషయం ఎన్నికల కమిషన్ చూసుకుంటుందని, తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ఆ పార్టీ అధినేత జగన్కు ఎదురు దెబ్బ తగిలినట్టైంది. సొంత ఇలాక అయిన పులివెందులను పోగొట్టుకోవడంతో జగన్కు ఘోర పరాభవం జరిగినట్లు వైసీపీ కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు. ఈ సమయంలో కోర్టుపై పెట్టుకున్న ఆశలు సైతం గల్లంతకావడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
జగన్కు అసలేమీ తెలియదు: హోంమంత్రి
గత 30 ఏళ్లలో కడపలో ఎక్కడైనా స్వచ్ఛందంగా ఓటు వేసే పరిస్థితి లేదని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కనీసం నామినేషన్ కూడా వేసే పరిస్థితి లేకండా జగన్ మోహన్ రెడ్డి రూల్ చేశాడు.. కానీ ప్రస్తుతం ప్రతీ ఒక్కరు స్వఛ్ఛందంగా బయటకు వచ్చి ఓటు వేశారు.. ప్రజాస్వామ్యం రుచి చూసారు.. ఒక్క రాష్ట్రమే కాదు.. పులివెందుల, ఒంటిమిట్ట కూడా కూటమి వైపు ఉన్నాయని ఈ విజయం ద్వారా తెలుస్తుంది.. ఆరు వేల ఓట్లతో పులివెందుల జెడ్పీటీసీ మెజారిటీతో కైవసం చేసుకున్నాం.. కూటమి ప్రభుత్వాన్ని పులివెందుల ప్రజలు స్వాగతం పలికారు.. వైసీపీకి కనీసం డిపాజిట్ రాలేదు అని ఎద్దేవా చేసింది. ప్రజాస్వామ్యాన్ని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముకున్న వారి ఎవరు నష్టపోలేదు.. రాజా రెడ్డి రాజ్యాంగాన్ని నమ్ముకుని జగన్ మోహన్ రెడ్డి 151 సీట్లు నుంచి 11 సీట్లుకి పడిపోయారని ఆరోపించారు.
సంక్షోభంలో వైఎస్ జగన్ భవిష్యత్తు
మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవహర శైలి, అతి విశ్వాసం ఆయనకు ఒంటరితనాన్ని తెచ్చిపెట్టింది. బీజేపీపై స్పష్టత లేకపోవడం, మిత్రపక్షాలతో స్నేహం చేయడం ఫెయిల్ అవ్వడం, బలమైన పోరాటం చేయకపోవడం వంటి కారణాలు 2014, 2024లో ఓటమికి కారణాలు. తాజాగా జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలూ దానిని మరోసారి ఫ్రూవ్ చేశాయి. ఇలానే సాగితే ఆయన రాజకీయ భవిష్యత్తు సంక్షోభంలో పడే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com