AP HC: చంద్రబాబుపై ఆరోపణలు తప్ప ఆధారాలు లేవన్న హైకోర్టు

స్కిల్ డెలవప్‌మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు పూర్తిస్థాయి బెయిల్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పులో అనేక కీలక విషయాలను ప్రస్తావించింది. కేసులో CID వాదనకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. తీవ్ర ఆరోపణలు చేస్తున్నప్పుడు చంద్రబాబుకు రిమాండ్ విధించాలని అభ్యర్థించక ముందే.... తగిన ఆధారాలను సేకరించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. నిధులు తెలుగుదేశం ఖాతాకి చేరాయనేందుకు CID వద్ద ఆధారాల్లేవన్న హైకోర్టు . దీన్ని దర్యాప్తు లోపంగా భావిస్తున్నామని పేర్కొంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఖాతాలకు నిధులను మళ్లించారనేందుకు సీఐడీ ఎలాంటి ప్రాథమిక ఆధారాలూ సమర్పించలేకపోయిందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చిచెప్పింది.
ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థతో ఒప్పందం చేసుకున్న సీమెన్స్, డిజైన్‌టెక్ సంస్థలు శిక్షణార్థులకు అత్యున్నత సాంకేతిక పరిజ్ఞాన్ని అందించడంలో విఫలమయ్యాయని...CID కచ్చితంగా చెప్పలేకపోతోందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ కేసులో ఓ నిందితుడికి బెయిల్ మంజూరు సందర్భంగా 2.13 లక్షల మంది యువత శిక్షణ పొందినట్లు, వారికి ధ్రువపత్రాలు అందజేసినట్లు శిక్షణకు సొమ్ము ఖర్చు చేసినట్లు ఇదే హైకోర్టు గుర్తించిందని కోర్టు గుర్తు చేసింది. హవాలా మార్గంలో నిధుల మళ్లింపునకు సీమెన్స్ సంస్థ ఎండీ సుమన్ బోస్, డిజైన్‌టెక్ సీఎండీ ఖన్వేల్కర్ మధ్య 2014 డిసెంబరు 31 నుంచి 2016 జనవరి వరకు వాట్సప్ సందేశాల ద్వారా కరెన్సీ నోట్ల నంబర్లు బదిలీ చేసుకున్నట్లు అదనపు ఏజీ ఆరోపించారన్న హైకోర్టు వాస్తవానికి స్కిల్ కేసులో ఒప్పందం 2017 జూన్ 30న జరిగిందని గుర్తుచేసింది. అలాంటప్పుడు 2014-16 మధ్య చోటు చేసుకున్న వాట్సప్ మెసేజ్‌లకు, ఈ కేసుకు ఎలాంటి సంబంధం ఉందనే దానికి ప్రాసిక్యూషన్ వద్ద సమాధానం లేదంది. అసలు వారిద్దరి మధ్య జరిగిన చాటింగ్‌లకు, చంద్రబాబుకు ఏం సంబంధమన్న న్యాయస్థానం ఆ సొమ్ము ఏ విధంగా అందింది, ఎందుకోసం లావాదేవీలు జరిపారనే విషయాన్ని ఆ మెసేజ్‌ల ఆధారంగా నిర్ణయించలేమని CIDనే చెబుతోందని స్పష్టం చేసింది.
2 లక్షల మందికి పైగా శిక్షణ తీసుకొని, ధ్రువపత్రాలు పొందారనేది నిర్వివాదాంశమని స్పష్టం చేసింది. నైపుణ్యాభివృద్ధి కేంద్రాల కోసం ప్రభుత్వం విడుదల చేసిన 370 కోట్లలో 241 కోట్ల నిధులను సీమెన్స్, డిజైన్‌టెక్ షెల్ కంపెనీలకు మళ్లించినట్లు CID వాదిస్తోందన్న హైకోర్టు... నిధుల మళ్లింపు నిజమనుకుంటే 2 లక్షల మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం సాధ్యపడేదేనా అని పిటిషనర్ ప్రశ్నిస్తున్నారని తెలిపింది. చంద్రబాబుకు లేదా ఆయన పార్టీ ఖాతాకు నిధులు మళ్లించినట్లు ఎలాంటి ఆధారాలు లేకుండా, శిక్షణ కేంద్రాల ఏర్పాటు విషయంలో నిధుల విడుదలకు ముఖ్యమంత్రి స్థాయిలో మొగ్గు చూపడాన్ని ఈ కేసులో ఆయన పాత్ర ఉన్నట్లుగా భావించలేమని తేల్చిచెప్పింది. ఉపగుత్తేదారుల స్థాయిలో జరిగే చిన్న తప్పులకు పిటిషనర్‌ను బాధ్యుడిగా చేయడానికి వీల్లేదన్న చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తున్నట్లు స్పష్టం చేసింది. అక్రమ లావాదేవీల్లో పిటిషనర్ పాత్ర ఉన్నట్లు ఆదాయపు పన్ను శాఖ తేల్చిందని CID వాదిస్తున్నా ఆ వాదనను బలపరిచేందుకు ఎలాంటి ఆధారాల్లేవని పేర్కొంది. సహ నిందితులను, సాక్షులు, తెలుగు దేశం సభ్యులను పిటిషనర్ పరోక్షంగా ప్రభావితం చేశారన్న సీఐడీ వాదనకు సైతం ఆధారాలు లేవంది.
కేసు నమోదు చేసిన 22 నెలల తర్వాత పిటిషనర్ పేరును నిందితుడిగా చేర్చినట్లు స్పష్టమవుతోందని... అంతేకాక పిటిషనర్‌ను అరెస్టు చేయడానికి ముందు మాత్రమే నమోదు చేసినట్లు తేటతెల్లమవుతోందని తెలిపింది. చంద్రబాబు తప్ప ఈ కేసులో నిందితులందరూ బెయిల్ లేదా ముందస్తు బెయిల్‌పై రిలీజ్ అయ్యారని న్యాయమూర్తి గుర్తుచేశారు. 2021లో కేసు నమోదు అనంతరం 140మందికి పైగా సాక్షులను సీఐడీ విచారించిందని... 4 వేలకు పైగా దస్త్రాలను సేకరించిందన్నారు. దర్యాప్తు తుది దశలో ఉందన్న న్యాయమూర్తి.... జడ్ ప్లస్ క్యాటగిరీ భద్రతలో ఉన్న పిటిషనర్ విదేశాలకు తప్పించుకుపోయే ప్రమాదమే లేదని...సాక్ష్యాల తారుమారు ప్రస్తావనే రాదన్నారు. అక్టోబరు 31న మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో CID అభ్యర్థన మేరకు.. కేసు గురించి మీడియాతో మాట్లాడొద్దని, ర్యాలీలు నిర్వహించవద్దని, రాజకీయ సమావేశాల్లో పొల్గొనవద్దని షరతు విధించామన్న జడ్జి... ప్రధాన బెయిల్ పిటిషన్‌ను పరిష్కరిస్తున్న ఈ సమయంలో అలాంటి షరతులు విధించడం చంద్రబాబుకు చెందిన రాజకీయ పార్టీ ఎన్నికల ప్రణాళికపై ప్రభావం చూపుతుందన్నారు. కనుక ఆ షరతును ఈ నెల 29 నుంచి సడలిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాది అక్టోబరు 31న మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను పూర్తిస్థాయిలో బెయిల్ ఉత్తర్వులుగా ఖరారు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైద్యం చేయించుకున్న వివరాలను ఈ నెల 28 లోపు విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేయాలని చంద్రబాబును ఆదేశించారు. ప్రస్తుతం కేసులో దర్యాప్తు జరుగుతున్నందున.. రాజకీయ ప్రతీకారంతో తనపై కేసు నమోదు చేశారన్న పిటిషనర్ వాదనతో న్యాయస్థానం అంగీకరించడం లేదని తీర్పులో పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com