AP HIGH COURT: కోర్టు కళ్లు మూసుకుని ఉండదు..

AP HIGH COURT: కోర్టు కళ్లు మూసుకుని ఉండదు..
బండారు కేసులో ఏపీ హైకోర్టు వ్యాఖ్యలు... నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక

తెలుగుదేశం సీనియర్‌ నేత బండారు సత్యనారాయణమూర్తిని మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచక ముందే పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌ను తమకు ఇవ్వడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. రిమాండ్ రిపోర్ట్‌ను ఏ విధంగా తమకు నేరుగా సమర్పించారన్నది అర్థం చేసుకోలేకపోతున్నామని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై పోలీసులు సమాధానం చెప్పాలని ఆదేశించింది. పోలీసులు చట్టాలను పాటించకపోతే న్యాయస్థానం కళ్లుమూసుకుని ఉండదని ఘాటుగా వ్యాఖ్యానించింది. బండారు సత్యనారాయణమూర్తి అరెస్ట్‌లో పోలీసులు నిబంధనలు పాటించలేదని తేలితే దర్యాప్తు అధికారి న్యాయపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది.


టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అరెస్టు విషయంలో నిబంధనలు అనుసరించలేదని తేలితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసులను హైకోర్టు హెచ్చరించింది. పోలీసులు చట్టనిబంధనలు ఉల్లంఘిస్తుంటే న్యాయస్థానం కళ్లుమూసుకొని ఉండలేదని ఘాటుగా స్పందించింది.పోలీసులు హైకోర్టుకు సమర్పించిన ఆధారాలు పరిశీలిస్తే గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి సోమవారం రాత్రి 7గంటల 45 నిమిషాలకు 41A కింద నోటీసు ఇచ్చినట్లు అదే సమయానికి అరెస్ట్ చేసినట్లు మెమోలో పోలీసులు తెలిపారు. ఏడేళ్ల జైలు శిక్షకు వీలున్న కేసులో 41A కింద నోటీసు ఇస్తూనే సమాంతరంగా అరెస్ట్ చేసినట్లు తేలితే సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు దర్యాప్తు అధికారి తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. అరెస్ట్ విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ కేసు విచారణను ఈనెల 5కు వాయిదా వేసింది.


మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ ఆయన సోదరుడు సింహాద్రిరావు దాఖలు చేసిన హెబియస్ కార్పస్‌ వ్యాఖ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. బండారు తరపు వాదనలు వినిపించిన న్యాయవాది పోలీసులు ఇచ్చిన 41A నోటీసులను సత్యనారాయణమూర్తి తీసుకుని సంతకం కూడా చేశారని తెలిపారు. కానీ నోటీసు తీసుకోవడానికి ఆయన నిరాకరించారంటూ పోలీసులు కోర్టును తప్పుదోవపట్టించారని వివరించారు. 41A కింద ఇచ్చిన నోటీసుల్లో మూడురోజుల్లో విచారణకు హాజరుకావాలంటూనే అప్పటికప్పుడే అరెస్ట్ చేశారని తెలిపారు. పోలీసుల తరపు వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది 41A నోటీసుపై సంతకం సత్యనారాయణమూర్తిది కాదన్నారు. పోలీసులు నోటీసు ఇవ్వబోతే ఆయన తిరస్కరించారన్నారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం అరెస్ట్ సమయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదని మేజిస్ట్రేట్ ముందు చెప్పేందుకు సత్యనారాయణమూర్తికి వెసులుబాటు ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.

Tags

Read MoreRead Less
Next Story