AP HC: సీఎం జగన్‌కు హైకోర్టు నోటీసులు
ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయంటూ ఎంపీ రఘురామరాజు వేసిన పిటిషన్ పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహా 41మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో తాము వ్యాజ్యం వేసిన తర్వాత కొన్ని ఆధారాలు మాయం చేసేందుకు ప్రయత్నించారని పిటీషనర్ కోర్టుకు తెలిపారు. ఇసుక, మద్యం, ఆరోగ్యశాఖకు కొనుగోలు చేసిన కొన్ని పరికరాలు, సిమెంట్ కొనుగోలు వ్యవహారంలో సీఎం తన బంధువులకు, అనుయాయులకు లబ్ధి చేకూర్చారన్న పిటిషనర్ వాటిపై సీబీఐ విచారణ జరపించాలని కోరారు. అనంతరం వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ రఘురామకృష్ణరాజు పిటిషన్‌కు విచారణార్హలే లేదని చెప్పారు. కేసును కొట్టివేయాలని కోరారు. ఈ వాదనలు విన్న కోర్టు పిటిషన్ విచారణ అర్హత తేల్చే ముందు నోటీసులు ఇస్తామని తెలిపింది. సీఎం జగన్ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి,ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పలువురు అధికారులకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 14 కు వాయిదా వేసింది.
అయితే విచారణ సందర్భంగా సీబీఐ, సీఐడీ కేసుల విచారణ జరుగుతున్న ఎంపీ రఘురామరాజు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడానికి అనర్హుడని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ పేర్కొనడంపై రఘురామ మండిపడ్డారు. 11 ఛార్జ్‌షీట్లలో నిందితుడైన వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి అర్హుడు కానీ... కోర్టులో పిల్ వేయడానికి తాను అర్హుడిని కానా అని రఘురామ ప్రశ్నించారు. ఆర్థిక నేరాభియోగ కేసుల్లో 43 వేల కోట్ల రూపాయలు జగన్ కొట్టేశాడని గుర్చు చేశారు. తాను వైసీపీ ఎంపీనని తప్పుడు ధృవీకరణ ఇచ్చారని అడ్వకేట్ జనరల్ పేర్కొనడంపై రఘురామ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తనను వైసీపీ ఇంకా బహిష్కరించలేదని... అడ్వకేట్ జనరల్ అధినేత జగన్‌కు చెప్పి తనను పార్టీ బహిష్కరించమని సలహా ఇవ్వాలని సూచించారు.
ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి అధికార బలంతో సొంత కంపెనీలకు, అనుయాయులకు లబ్ధి చేకూరుస్తున్నారని రఘురామ మరోసారి ఆరోపించారు. దానిని సవివరంగా వివరిస్తూ 1340 పేజీలతో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు, ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని చూసి తట్టుకోలేకనే ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశానని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవిని ఎలా చిత్రహింసలకు గురిచేశారో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చెప్పిన విషయాన్ని రఘురామ గుర్తు చేశారు. బీటెక్ రవి భార్య అప్రమత్తంగా వ్యవహరించడంతోనే ఆయనకు ప్రాణ ముప్పు తప్పిందన్నారు. గత్యంతరం లేని పరిస్థితిలోనే పది నెలల క్రితం నమోదు చేసిన కేసులో బీటెక్ రవిని అరెస్టు చేశామని చెప్పి మేజిస్ట్రేట్ ముందు పర్చారన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com