ఎస్‌ఈసీ ఆదేశాలను అమలు చేయాలి : హైకోర్టు

ఎస్‌ఈసీ ఆదేశాలను అమలు చేయాలి : హైకోర్టు
ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియో తీసేలా ఎన్నికల అధికారులను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెలువరించింది.

ఏపీలో పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియో తీసేలా ఎన్నికల అధికారులను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఎస్‌ఈసీ ఆదేశాలను అమలు చేయాలంటూ హైకోర్టు స్పష్టం చేసింది.. పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియను వీడియో రికార్డు చేయాలని ఎస్‌ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను జిల్లా కలెక్టర్లు అమలు చేయకపోవడాన్ని సవాల్‌ చేస్తూ కృష్ణాజిల్లాకు చెందిన శ్రీపతి నాంచారయ్య, గుంటూరు జిల్లాకు చెందిన ప్రతాప్‌ నాయక్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు తీర్పును వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను ఎంపీడీవోలు పరిశీలించి, తక్షణం స్పందించాలన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలన్నదే ప్రతీఒక్కరి లక్ష్యమనీ, వనరుల కొరత ఇతర కారణాలు ఈ లక్ష్య సాధనకు అడ్డంకి కాకూడదనీ స్పష్టం చేశారు.

పిటిషనర్ల తరపున న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్‌, విష్ణుతేజ వాదనలు వినిపించారు. మూడు, నాలుగు దశల్లో జరిగే ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే, ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎస్‌ఈసీ ఆదేశాలను ప్రభుత్వ అధికారులు అమలు చేస్తున్నారని ప్రభుత్వం తరపు న్యాయవాది కిరణ్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు. నిష్పాక్షికంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి కట్టుబడి ఉన్నామని ఎస్‌ఈసీ, ప్రభుత్వం హామీ ఇస్తున్నందున.. ఫిర్యాదుల పై తక్షణం స్పందించాలని ఎంపీడీవోలను ఆదేశించినట్లు ఎస్‌ఈసీ చెబుతున్నందున.. అధికారులు ఈ విధంగా ప్రవర్తించాలని నిర్దిష్ట ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లుగా తీర్పులో పేర్కొన్నారు.




Tags

Read MoreRead Less
Next Story