AP: అసలు దిశా చట్టం ఉందా: హోంమంత్రి

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళలపై జరిగిన అఘాయిత్యాలపై హోంమంత్రి వంగలపూడి అనిత విరుచుకుపడ్డారు. మండలిలో మహిళలపై అఘాయిత్యాలపై వాడివేడి చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల మధ్య వాగ్వాదం నడిచింది. ఏపీలో జగన్ ప్రభుత్వం కంటే ఈ ఐదు నెలల కూటమి ప్రభుత్వంలో క్రైమ్ రేటు చాలా తగ్గిందని హోంమంత్రి అనిత తెలిపారు.మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రశ్నించారు. దిశ చట్టం తీసుకొస్తారా, దిశ యాప్ కొనసాగిస్తారా లేదా అని వైసీపీ ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి ప్రశ్నించారు. గత ప్రభుత్వ పాలనలో చాలా లోపాలున్నాయని మంత్రి అనిత అన్నారు. హోం మంత్రి అనిత వ్యాఖ్యలను వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందంటూ నినాదాలు చేశారు. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ కారణంతోనే 'నీలాంటి' వారు సభకు వస్తున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను ఉద్దేశించి మంత్రి అనిత అన్నారు. తన సమాధానం వినటానికి దమ్ము, ధైర్యం కావాలని మంత్రి అనిత అన్నారు.
దిశ పేరుతో కాలక్షేపం
దిశ పేరుతో కాలక్షేపం చేశారని హోం మినిస్టర్ అనిత అన్నారు. 2014 సమయంలో టీడీపీ ప్రభుత్వంలో తీసుకువచ్చిన 'ఫోర్త్ లయన్' యాప్‌నే దిశగా చెప్పుకున్నారని ఆరోపించారు. మహిళా పోలీస్ స్టేషన్లను దిశ స్టేషన్లుగా మార్చుకున్నారని మండి పడ్డారు. వైసీపీ చెప్పే దిశ ఉంటే గత ఐదేళ్లూ నేరాల్లో ఏపీని అగ్రస్థానంలో ఎందుకు నిలబెట్టారని ప్రశ్నించారు. నిర్భయ చట్టాన్ని గాలికి వదిలేసి ఎంతో మందిని పొట్టనపెట్టుకున్నారన్నారు. గతంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని హోం మంత్రి అనిత విమర్శించారు. గత ఐదేళ్లలో పోలీసులు పరదాలు కట్టడానికి, చెట్లు నరకడానికి, రోడ్ల మీద కాపలా కాయడానికి పని చేశారని అన్నారు. దిశ చట్టానికి చట్టబద్ధత లేకుండా దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశారన్నారు. రాజమహేంద్రవరంలో దిశ పోలీసు స్టేషన్ ప్రారంభించారని.. అదే రోజు దళిత మహిళపై సామూహిక అత్యాచారం చేసి పోలీసు స్టేషన్ ముందు వదిలేసి వెళ్లారన్నారు. దిశ యాప్‌తో నేరాలు తగ్గింది నిజమైతే.. రికార్డుల్లో ఎందుకు నేరాలు పెరుగుతున్నాయని హోంమంత్రి ప్రశ్నించారు. అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ కట్టడానికి వైకాపా హయాంలో కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. అది పూర్తయి ఉంటే నేరాలు జరిగిన వెంటనే శిక్షలు పడేందుకు అవకాశం ఉండేదన్నారు.
పరామర్శకు వెళ్లినా కేసులు పెట్టారు
వైసీపీ హయాంలో పరామర్శకు వెళ్లిన తమపైనే కేసులు పెట్టారని అనిత గుర్తు చేశారు. దిశ చట్టం గురించి గొప్పగా చెబుతున్నారు.. అసలు ఆ చట్టం ఉందా? దిశ యాప్, చట్టం పని చేస్తే మహిళలపై అఘాయిత్యాలు ఎందుకు పెరిగాయని ప్రశ్నించారు. ఉన్న నిర్భయ చట్టాన్ని వదిలేసి.. లేని దిశ చట్టాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన వారిని అరెస్టు చేస్తున్నామని... ముచ్చుమర్రి ఘటనలో బాలికను గుర్తించడానికి సమయం పట్టిందన్నారు. పోలీసుల వైఫల్యం ఇప్పటిది కాదని.. వైసీపీ హయాం నాటిదన్నారు. కూటమి ప్రభుత్వంలో పోలీసులు 24 నుంచి 48 గంటల్లో నేరస్థుల్ని పట్టుకుంటున్నారని తెలిపారు.
అనిత, బొత్సల మధ్య మాటల యుద్దం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. శాసనమండలిలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య వాగ్వాదం జరిగింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై సమాధానం ఇవ్వాల్సిందిగా అనిత డిమాండ్ చేశారు. ముందు రాష్ట్రంలో గాడి తప్పిన శాంతి భద్రతలపై వివరణ ఇవ్వాలని, లేని పక్షంలో సభ నుంచి వాకౌట్ చేస్తామని బొత్స ప్రకటించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com