AP Debts: ఏపీని కమ్మేస్తున్న అప్పులు.. ఏటా రూ. 50,000 కోట్లు..

AP Debts: ఏపీని కమ్మేస్తున్న అప్పులు.. ఏటా రూ. 50,000 కోట్లు..
AP Debts: ఏపీ ఏటా చేస్తున్న అప్పులు, వాటిపై వడ్డీలు.. పన్నుల రూపంలో సమకూరే ఆదాయానికి దగ్గరగా ఉన్నాయి.

AP Debts: ఏపీ ఏటా చేస్తున్న అప్పులు, వాటిపై వడ్డీలు రూపంలో చెల్లించే మొత్తాలు..రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో సమకూరే ఆదాయానికి దగ్గరగా ఉన్నాయి. మరోవైపు అప్పులు అంతకంతకూ పెరుగుతున్నాయి. వాటికి అనుగుణంగా చెల్లింపులు భారమూ పెరుగుతూ వస్తోంది. వేల కోట్ల అప్పులు తెస్తూ రోజువారీ ఖర్చులు, జీతాలకు వాడేసుకుంటున్నారు. వీటికి అదనంగా బహిరంగ మార్కెట్‌ రుణాలు, కార్పొరేషన్ల ద్వారా తెచ్చే గ్యారంటీ రుణాలు, ఇతరత్రా నాన్‌ గ్యారంటీ రుణాలు, పబ్లిక్‌ డెట్‌తోపాటు పెండింగు బిల్లులన్ని కలిపి రాష్ట్రంపై దాదాపు 8 లక్షల 50 వేల కోట్ల చెల్లింపుల భారం ఉందని అంచనా.

ఏటా బడ్జెట్‌లో చూపి.. చెల్లిస్తున్న వడ్డీలు, పబ్లిక్‌ డెట్‌ చెల్లింపుల మొత్తమే అధికారికంగా దాదాపు 35 వేల కోట్ల వరకు ఉంటోంది. రాబోయే రోజుల్లో ఇది 40 వేల కోట్ల వరకు పెరిగే అవకాశముంది. ఇవి కాకుండా కార్పొరేషన్ల అప్పులు, పెండింగు బిల్లుల చెల్లింపు భారం దీనికి అదనం. రాష్ట్రంలోని చాలా ప్రభుత్వ రంగ సంస్థలకు, ప్రభుత్వ కార్పొరేషన్లకు సొంత కార్యకలాపాలు లేవు. ఆదాయాలు లేవు. అవి తీసుకొచ్చే రుణాలను ప్రభుత్వాలే వినియోగించుకుంటున్నాయి. ఆ అప్పులు, వడ్డీలను రాష్ట్ర బడ్జెట్‌ నుంచే చెల్లించాల్సి ఉంటుంది.

ఇలా చెల్లించే మొత్తాలు ఏడాదికి రూ.12 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల వరకు ఉంటాయి. ఇవన్ని కలిపితే ఏడాదికి రూ.50 వేల కోట్లపై మాటగానే చెల్లింపుల భారం ఉంటుందని నిపుణుల అంచనా. రెండేళ్ల కిందట ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. 25 వేల కోట్ల రుణం తీసుకోవడం దీని లక్ష్యం. కొన్ని మద్యం డిపోల ఆదాయాన్ని రుణం తీర్చేందుకు కార్పొరేషన్‌కు 13 ఏళ్ల పాటు మళ్లిస్తామన్నారు. వేల కోట్ల విలువైన విశాఖలోని ప్రభుత్వ భూములను తనఖా పెట్టారు. ఈ విధానాన్ని కేంద్ర ఆర్థికశాఖ తప్పు పట్టింది.

ఫలితంగా SBI చివర్లో కొంత మేర రుణం నిలిపివేసింది. దీంతో 23,200 కోట్లే రుణం తీసుకున్నారు. 2021 ఆగస్టు నుంచి నెలకు 250 కోట్ల చొప్పున ఈ రుణాన్ని తిరిగి చెల్లిస్తున్నారు. ఏడాదికి రూ.3,000 కోట్లు అవుతుంది. అంటే 13 ఏళ్లలో వడ్డీతో సహా కలిపి దాదాపు 40 వేల కోట్లు చెల్లించాల్సి వస్తుంది. బెవరేజెస్‌ కార్పొరేషన్‌ నుంచి డిబెంచర్లు జారీ చేసి, వాటిని అమ్మి 8 వేల 305 కోట్ల రుణం తీసుకున్నారు. వడ్డీ 9.6 శాతంగా ఉంది. పదేళ్లలో తిరిగి చెల్లింస్తామన్నారు. ఏడాదికి 831 కోట్ల అసలు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి వడ్డీ అదనం.

రాష్ట్ర ఖజానాకు వ్యాట్‌ రూపంలో వచ్చే ఆదాయాన్ని తగ్గించారు. అంతే మొత్తం బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ప్రత్యేక సుంకంగా వసూలు చేసుకునేందుకు అనుమతిచ్చారు. ఆ మొత్తంతోనే రుణం తీర్చాల్సి వస్తుంది. అంటే ఈ కార్పొరేషన్‌ రుణానికి రాష్ట్ర ఆదాయం మళ్లించి తీర్చాల్సి వస్తోంది. ఇవే కాక ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి తెచ్చిన కార్పొరేషన్ల రుణాలు లక్షా 15 వేల 403 కోట్లు. ఆ రుణాల చెల్లింపు భారము రాష్ట్ర బడ్జెట్‌పైనే పడుతోంది. మరోవైపు పెండింగ్‌ బిల్లులు లక్షా 50 వేల కోట్లు ఉండొచ్చని అంచనా. ఈ బిల్లుల మొత్తం ఎంత అన్న దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు.

...................................

రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో వడ్డీల కోసం చెల్లించాల్సిన వాటాయే అధికంగా ఉంటుందని తెలిపింది కాగ్‌. గత అయిదేళ్లలో ప్రభుత్వం కొత్తగా తీసుకుంటున్న ప్రతి అప్పులో 65 శాతం నుంచి 81 శాతం వరకు పాత అప్పులను తీర్చేందుకే వినియోగించాల్సి వస్తోందని స్పష్టం చేసింది. సాధారణంగా అప్పు తీసుకుంటే దానితో ఆస్తులను సృష్టించాలి. అంటే ప్రభుత్వానికి మళ్లీ ఆదాయం అందించేలా అభివృద్ధి కార్యక్రమాలపై వెచ్చించాలి. ఇప్పుడు రోజు వారీ అవసరాలను తీర్చుకునేందుకు, రుణాలపై వడ్డీలను చెల్లించేందుకే మళ్లీ అప్పు తీసుకోవడం అనేది ఆర్థిక అస్థిరతకు దారి తీస్తుందనేది నిపుణుల మాట.

.................................

ఏపీ సర్కార్‌ అప్పులు చేస్తున్న విధానాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సైతం తప్పు పట్టింది. బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ తీసుకుంటున్న రుణాలు ఆర్థిక ఉల్లంఘన కిందకు రావని ఎలా చెప్పగలరో తెలియజేయాలంటూ కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి సోమనాథన్‌ ఏపీ సీఎస్‌కు ఈ ఏడాది ఆగస్టు 22న లేఖ రాశారు. ఇదే అంశంపై చర్చించేందుకు దిల్లీ పిలిపించారు. అంతేకాదు... ఆంధ్రప్రదేశ్‌లోని కార్పొరేషన్లకు రుణాలు ఇచ్చే సందర్భంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్ర ఆర్థికశాఖ వివిధ బ్యాంకులను గతంలో హెచ్చరించింది.

Tags

Read MoreRead Less
Next Story