AP: సాకు మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదు

వ్యవసాయం కోసం వినియోగించే మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో విద్యుత్‌శాఖలో రూ.1.29లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు. పీపీఏలు రద్దు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం చెప్పినా వైసీపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని.. దీని వల్ల పెట్టుబడులు వెనక్కి వెళ్తాయన్నా వినలేదని చెప్పారు. విద్యుత్ వ్యవస్థను గాడిన పెట్టేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ మాట్లాడారు. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల కారణంగా విద్యుత్ రంగ సంస్థలపై సుమారు రూ. 1.29 లక్షల కోట్ల భారం పడిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత పీపీఏల రద్దు అంశం చాలా వివాదాస్పదం అయినట్లు మంత్రి పేర్కొన్నారు. కేవలం పీపీఏల రద్దు కారణంగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయినట్లు విమర్శించారు. ప్రతీ ఏడాది వినియోగదారుల సంఖ్య 5 నుంచి 6 శాతం పెరుగుతున్నా కానీ గత ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో కొత్తగా ఒక్క మెగా వాట్ విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేసిన పాపాన పోలేదని విమర్శించారు. విద్యుత్ వ్యవస్థను గాడిన పెట్టేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కూటమి ప్రభుత్వం గ్రీన్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఇందు కోసం ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం పాలసీ తీసుకొచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఏపీ తీసుకొచ్చిన పాలసీ కారణంగా రాష్ట్రానికి పెట్టుబడులు క్రమంగా వస్తున్నాయని అన్నారు.
లోపాలు సరిదిద్దే యత్నం
విద్యుత్ వినియోగానికి జరిమానాలు వేసిన విష సంస్కృతి జగన్ హయాంలో ఉండేదని గొట్టిపాటి మండిపడ్డారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి ఒక్క రూపాయి కూడా విద్యుత్ చార్జీలు పెంచకుండా పాలించిన ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు అధికారం నుంచి దిగిపోయే నాటికి ఈఆర్సీకి కేవలం రూ. 3 వేల కోట్ల మాత్రమే అప్పు ఉన్నట్లు మంత్రి గొట్టిపాటి గుర్తు చేశారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత 2022-23 ఏడాదికి రూ. 6 వేల కోట్లు అప్పు ఉన్నట్లు చూపించారని పేర్కొన్నారు. దీనితో పాటు 2023-24 ఏడాదికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు స్పష్టం చేశారు. మొత్తంగా రూ. 17 వేల కోట్లు ప్రజలపై భారం వేయాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని మండిపడ్డారు. వైసీపీ పాలనలో విద్యుత్ రంగం సర్వనాశనం అయ్యిందని నమ్మిన ప్రజలు వారిని 11 సీట్లకే పరిమితం చేసినట్లు విమర్శించారు. గత ప్రభుత్వం తీసుకుని వచ్చిన చట్టం లోని లోపాలను సరిదిద్దే ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం, 2024 బిల్లు తీసుకొస్తున్నాట్లు రవి కుమార్ తెలిపారు. ఈ సవరణ వల్ల వినియోగదారులపై కొత్తగా అదనపు భారం గానీ, విద్యుత్ సుంకం కానీ విధించడం లేదని స్పష్టం చేశారు. ఈ బిల్లును వైసీపీ ప్రభుత్వం 2021 లోనే తీసుకుని వచ్చినా... సుంకం విధించే విషయంపై ఎక్కడా స్పష్టత ఇవ్వలేదని పేర్కొన్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టే నాటికి విద్యుత్ అంతరాయాలు ఏపీలో ఎక్కువగా ఉండేవని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు.
జగన్ స్వార్థమే కారణం
రాష్ట్రంలో విద్యుత్ రంగం దారుణ సంక్షోభానికి జగన్ స్వార్థ పరిపాలనే కారణమని మంత్రి అన్నారు. నాడు విద్యుత్ పీపీఏల రద్దుకు పారిశ్రామిక వేత్తల్ని మారణాయుధాలతో బెదిరించిన మాఫియా ప్రభుత్వమని అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలపై మోపిన చార్జీల భారం, లోవోల్టేజీ సమస్య, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లలో కష్టాలను సభ దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి సమాధానమిస్తూ... 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి తన స్వార్థం కోసం పీపీఏలను రద్దు చేసి సర్వనాశనం చేశారని విమర్శించారు. కేంద్రం వద్దన్నా వినకుండా ఉత్పత్తి ఆపించి, ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసి ప్రజలపై భారాన్ని మోపారన్నారు. ఇప్పుడు మళ్లీ సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, ‘ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024’కు అసెంబ్లీ ఆమోదం లభించినందున మంచి రోజులు వస్తాయని మంత్రి అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com