TDP: జోగీతో టీడీపీ జోడీ.. భగ్గుమన్న శ్రేణులు

TDP: జోగీతో టీడీపీ జోడీ.. భగ్గుమన్న శ్రేణులు
X
వివరణ ఇవ్వాలని ఆదేశించిన నారా లోకేశ్‌

టీడీపీ నేతలు, జనసేన నేతలతో విమర్శలతో విరుచుకుపడే వైసీపీ నేత జోగి రమేష్‌తో.. టీడీపీ నేతలు వేదిక పంచుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఏలూరు జిల్లా నూజివీడులో జరిగిన సర్దార్‌ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌తో టీడీపీ సీనియర్‌ నాయకులు అత్యంత సన్నిహితంగా మెలగడం, ఒకే వాహనంపై పట్టణంలో ఊరేగడంపై టీడీపీ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. మంత్రి కొలుసు పార్థసారధి, ఎమ్మెల్యే గౌతు శిరీష, పార్టీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణపై.. మంత్రి లోకేష్ సీరియస్ అయ్యారు. మాజీమంత్రి, వైసీపీ నేత జోగి రమేష్‌తో కలిసి వేదిక పంచుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని కొలుసు పార్థసారధిని లోకేష్ ఆదేశించారు. ఈ వ్యవహారం ఆంధ్రా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అసలేం జరిగిందంటే...

ఉమ్మడి కృష్ణా జిల్లా, ప్రస్తుత ఏలూరు జిల్లాలోని నూజివీడులో గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. దీనికి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొలుసు పార్థసారధి, టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీషను నిర్వాహకులు ఆహ్వానించారు. టీడీపీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. మాజీమంత్రి, వైసీపీ కీలక నేత, గౌడ సామాజికవర్గానికి చెందిన జోగి రమేష్‌ను కూడా నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జోగి రమేష్‌తో కలిసి టీడీపీ నేతలు పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ వ్యవహారంపై గుర్రుగా ఉన్నారు. చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్లి, టీడీపీ నేతలను బూతులు తిట్టే జోగి రమేష్‌తో టీడీపీ నేతలు పాల్గొనడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని లోకేష్ ఆదేశించారు.

జోగి అందుకే వెళ్లారా... ?

నూజివీడు నియోజకవర్గంలో గౌడ సామాజికవర్గం ఓట్లు 30 వేల వరకూ ఉన్నాయి. . ఈ సామాజికవర్గం వారు అటు వైసీపీలో ఇటు టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరు గౌతు లచ్చన్న విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో టీడీపీకి సపోర్ట్ చేసేవారు టీడీపీ నేతలను ఆహ్వానించారు. వైసీపీకి సపోర్ట్ చేసేవారు.. జోగి రమేష్‌ను ఆహ్వానించారు. అందుకే ఇరు పార్టీల నేతలు హాజరయ్యారు.

Tags

Next Story