LOKESH: నా తల్లిని అవమానించింది మరిచారా..?

LOKESH: నా తల్లిని అవమానించింది మరిచారా..?
X
శాసన మండలిలో నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం... చంద్రబాబు సింగిల్ గా సింహంలా నిలబడ్డారన్న లోకేశ్

ఏపీ శాసనమండలిలో ఎమ్మెల్సీ బొత్స సత్యానారాయణ , మంత్రి నారా లోకేశ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. వైసీపీ సోషల్ మీడియా అరెస్టులపై చర్చకు వైసీపీ పట్టుబట్టింది. చైర్మన్ పోడియంను చుట్టిముట్టి సభ్యులు ఆందోళన చేపట్టారు. ఫార్మాట్‌లో రావాలని చైర్మన్ ఎంత చెప్పినా నిరసన కొనసాగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యుల తీరును తప్పుబట్టారు. అసెంబ్లీ సాక్షిగా తన తల్లి భువనేశ్వరిని అవమానించిన విషయాన్ని గుర్తు చేస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడంపై ఆయన శానసమండలిలో ప్రశ్నించారు. అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని నిలదీశారు. గతంలో తమ పార్టీకి సంఖ్యాబలం తక్కువ ఉన్నా చంద్రబాబు సభకు వచ్చారని గుర్తు చేశారు. తన తల్లిని అవమానించిన తర్వాతనే చంద్రబాబు సభకు రాలేదని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.


చంద్రబాబు సింహంలా నిలబడ్డారు

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు సభకు వచ్చారని... సింహంలా సింగిల్‌గా నిలబడ్డారని నారా లోకేశ్‌ అన్నారు. శాసనమండలిలో బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడారు. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించిన తర్వాతే.. చంద్రబాబు ప్రతిజ్ఞ చేసి వెళ్లిపోయారని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ పోస్టులు పెడుతున్నారు. తాము ఏనాడూ జగన్‌ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడలేదు. ‘‘ఆ రోజు నా తల్లిని అన్ని మాటలన్న జగన్‌ ఇప్పుడు సభకు ఎందుకు రావడం లేదు’’ అని లోకేశ్‌ ప్రశ్నించారు.

అసెంబ్లీకి రాకపోతే అవమానించినట్లే

అసెంబ్లీకి రాకపోతే ప్రజలను అవమానించినట్లేనని లోకేశ్‌ అన్నారు. తాజాగా ఆయన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని, వాళ్లే జగన్‌‌‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్నారు. అసెంబ్లీకి జగన్‌ రాకపోవడాన్ని.. ప్రజలకు ప్రజాస్వామ్యానికి గౌరవం ఇవ్వనట్లేనని భావించాలన్నారు. శాసన మండలిలో నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. శాసనసభ సాక్షిగా తన తల్లిని అవమానిస్తే చేతులు కట్టుకుని కూర్చోవాలా అని వైసీపీ నేతలను తీవ్ర స్వరంతో హెచ్చరించారు. దీంతో వైసీపీ హయాంలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేలకు మూడినట్లే అన్న కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి. లోకేశ్ కామెంట్లపై టీడీపీ శ్రేణులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధినేతను దూషించిన వారిని వదిలిపెట్టవద్దంటూ కోరుతున్నారు.

Tags

Next Story