AP: చేనేతల బతుకు మారుస్తున్న లోకేశ్ వీవర్స్‌శాల

ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళగిరిలో అత్యంత ఆధునిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన వీవర్స్ శాలతో చేనేతల బతుకు మారుతోంది. 20 మగ్గాలతో ఏర్పాటు చేసిన వీవర్‌శాలతో మగ్గాలు కొత్త కళను సంతరించుకున్నాయి. ఇందులో అత్యాధునిక జాకార్డు మగ్గాలను ఏర్పాటు చేసి వాటిపై రెండు నెలలు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వీటిని విస్తరించే దిశగా మంత్రి అడుగులు వేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఆటోనగర్‌లో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన ‘వీవర్‌శాల’. చాలీచాలని రాబడితో దుర్భరంగా జీవితాలను ఈడుస్తున్న నేతన్నలకు.. తనవంతుగా నూలుపోగంత మేలైనా చేసి, మగ్గిపోతున్న మగ్గాలకు కొత్త కళ తీసుకురావాలన్న మంత్రి లోకేశ్ కలకు తార్కాణం.
కార్పొరేట్ స్థాయిలో విశాలమైన ప్రాంగణం..అత్యాధునిక మగ్గాలు.. నేలపై కాకుండా కుర్చీలో కూర్చుని, గాలి, వెలుతురు మధ్య పనిచేసుకొనే వెసులుబాటు, భోజనశాల, మరుగుదొడ్లు, విశ్రాంతిగది, నాణ్యతను పరిశీలించేందుకు ప్రత్యేక ఏర్పాటు.. ఇలా అన్ని వసతులతో నేతన్నకు సౌకర్యాలు కల్పించాలని లోకేశ్ తలచారు. ఆ వెంటనే చేనేతలో అనుభవజ్ఞులైన ఏడుగురు సభ్యుల బృందాన్ని చెన్నై, కోయంబత్తూరు పంపించి టాటా గ్రూపునకు చెందిన ‘తనైరా’ చేనేత వీవర్స్‌శాలలను, ఇతర నేత విధానాలను, పొందుతున్న ఆదాయం వంటి వాటిపై నివేదిక తయారుచేయించారు. దాని ఆధారంగా లోకేశ్ తన సొంత ఖర్చులతో మంగళగిరి ఆటోనగర్‌లో ఓ విశాలమైన ప్రాంగణంలో 20 మగ్గాలతో ఇలా ‘వీవర్‌శాల’ను ఏర్పాటు చేశారు. ఇందులో అత్యాధునిక జాకార్డు మగ్గాలను ఏర్పాటు చేసి వాటిపై నేతకార్మికులకు రెండు నెలలు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వీటిని విస్తరించి చేనేత రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే దిశగా మంత్రి అడుగులు వేస్తున్నారు.
ఇది నారా లోకేశ్ కల: బ్రాహ్మణి
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com