NARAYANA: అమరావతి పూర్తి సురక్షితం

NARAYANA: అమరావతి పూర్తి సురక్షితం
X
పుకార్లు నమ్మవద్దని మంత్రి విజ్ఞప్తి... వైసీపీ ఆరోపణలపై ఆగ్రహం

అమరావతి పూర్తిగా సేఫ్ జోన్‌లో ఉందని, ఎలాంటి ఇబ్బందీ లేదని... ఎలాంటి దుష్ప్రచారం నమ్మొద్దని ఏపీ పురపాలకశాఖ మంత్రి నారాయణ విజ్ఞప్తి చేశారు. అమరావతి నిర్మాణంలో భాగంగా మూడు కెనాల్స్​ను డిజైన్‌ చేశామన్నారు. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్‌ను డిజైన్‌ చేసినట్లు తెలిపారు. వచ్చే వానాకాలం నాటికి ఈ కాల్వలను పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో అమరావతి మునిగిపోతుందని విష ప్రచారం చేసిందని మంత్రి నారాయణ అన్నారు. అమరావతి రాజధానికి పనికిరాదని గత ప్రభుత్వం ప్రచారం చేయడంతో పాటు ప్రపంచబ్యాంకు కు కూడా నిధులు ఇవ్వొద్దని లేఖలు రాశారని విమర్శించారు. కృష్ణా నదికి రికార్డు స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నారు.

వరద ఇబ్బందులు లేకుండా కాల్వలు

అమరావతి డిజైన్ సమయంలోనే వరద ఇబ్బందులు లేకుండా కాల్వలు, రిజర్వాయర్లు ప్రతిపాదనలు చేశామన్నారు. కొండవీటి వాగు, పాల వాగు ల ప్రవాహంతో పాటు గ్రావిటీ కెనాల్స్ డిజైన్ చేశామని మంత్రి చెప్పారు. వచ్చే వర్షాకాలం నాటికి ఈ మూడు కెనాల్స్ ను పూర్తి చేసేలా త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. అనంతవరం నుంచి ఉండవల్లి వరకూ 23.6 కిమీలతో కొండవీటి వాగు, దొండపాడు నుంచి కృషాయపాలెం వరకూ 16.7 కి.మీ మేర పాల వాగు, వైకుంఠపురం గ్రావిటీ కెనాల్ ను 8 కి.మీ మేర అభివృద్ధి చేస్తామన్నారు. మొత్తం 48.3 కి.మీ మేర ఈ మూడు కాలువలు అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. వాగులు కొన్ని చోట్ల ఉండాల్సిన దానికంటే కూచించుకుపోయిందన్నారు. గత వందేళ్లలో కృష్ణా నదికి వచ్చిన వరద ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకుని మూడు కాల్వలు అభివృద్ధి చేస్తున్నామని మంత్రి చెప్పారు.

రిజర్వాయర్ల నిర్మాణం

సీడ్ కేపిటల్ లోపల నీరు కొండ వద్ద 0.4 టీఎంసీలు, కృష్ణాయపాలెం వద్ద 0.1టీఎంసీ లు, శాఖమూరు వద్ద 0.01టీఎంసీలు సామర్థ్యంతో రిజర్వాయర్లు, సీడ్ కేపిటల్ వెలుపల లాం వద్ద 0.3 టీఎంసీ లు,పెద పరిమి వద్ద 0.2 టిఎంసి ల, వైకుంఠపురం వద్ద 0.3 టిఎంసి ల సామర్థ్యం తో మొత్తం ఆరు రిజర్వాయర్లు నిర్మాణం చేపడుతున్నామని మంత్రి ప్రకటించారు. ఎంత వర్షం వచ్చినా సరే కాలువలు, రిజర్వాయర్లు సరిపోతాయన్నారు. ఒకవేళ ఇవి నిండిపోయినా సరే కృష్ణా నదిలోకి పంపింగ్ చేసేందుకు కూడా ప్రతిపాదనలు ఉన్నట్లు మంత్రి చెప్పారు.

Tags

Next Story