జగన్ సర్కార్‌కు ఎస్‌ఈసీ షాక్!

జగన్ సర్కార్‌కు ఎస్‌ఈసీ షాకుల మీద షాకులిస్తోంది.. పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలకు వ్యతిరేకంగా కఠినంగా వ్యవహరించిన నిమ్మగడ్డ మున్సిపల్ ఎన్నికల విషయంలోనే అంతే సీరియస్‌గా వెళ్తున్నారు.. మున్సిపల్ ఎన్నికల్లో గతంలో బలవంతపు ఉపసంహరణలు జరిగిన చోట చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో జరిగిన బలవంతపు నామినేషన్ల ఉపసంహరణపై సమీక్షిస్తామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. నామినేషన్ల ఉపసంహరణపై ఫిర్యాదులు వస్తే స్వీకరిస్తామని.. అలాంటి వారికి మరో అవకాశం ఇస్తామన్నారు. ఈమేరకు రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల అధికారులకు ఎస్‌ఈసీ ఆదేశాలు ఇచ్చారు. వచ్చే నెల రెండో తేదీలోగా ఫిర్యాదులను కమిషనుకు పంపాలని సూచించారు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి అభ్యర్థిత్వాల పునరుద్దరణపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
గతేడాది మార్చిలోనే పురపాలక సంఘాల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్లు వేయడం, వాటి పరిశీలన కూడా అప్పుడే అయిపోయింది. ఉపసంహరణ మాత్రమే మిగిలి ఉంది అనుకున్న సమయంలో.. కరోనా వల్ల ఎలక్షన్స్‌కి బ్రేక్ పడింది. ఇప్పుడు ప్రస్తుతం పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్నందున.. అవి పూర్తయ్యాక మున్సిపోల్స్ పూర్తి చేయాలని SEC నిర్ణయించింది. అయితే, నామినేషన్ల సందర్భంగా జరిగిన ఘటనలపై అప్పట్లో తీవ్రంగా స్పందించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ.. ఈసారి మాత్రం వాటి గురించి ప్రస్తావించకుండా మున్సిపల్ ఎన్నికల కొత్త షెడ్యూల్ ఇచ్చారు. ఆగిన చోట నుంచే ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఏకగ్రీవాల విషయాన్ని వివిధ పార్టీలు SEC దృష్టికి తీసుకెళ్లాయి. వందల సంఖ్యలో బలవంతపు నామినేషన్ల ఉపసంహరణలు జరిగాయని విపక్షాలు ఆరోపించాయి. రీనోటిఫికేషన్‌కు డిమాండ్ చేశాయి.
విపక్షాల అభ్యంతరాలపై స్పందించిన ఎస్‌ఈసీ.. గతంలో జరిగిన అసాధారణ నామినేషన్ల ఉపసంహరణను పునరుద్ధరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. బలవంతపు ఉపసంహరణలు ఎన్నికల స్ఫూర్తికి విరుద్ధం కాబట్టి స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల కమిషన్ తనకున్న విశేషాధికారాలతో వీటి పునరుద్ధరణకు మొగ్గు చూపుతోందని స్పష్టం చేశారు.. అయితే, బెదిరింపుల కారణంగా బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించినట్టు తేలిన చోట్ల మాత్రమే నామినేషన్లు వేసేందుకు అవకాశం ఇవ్వడం చర్చనీయాంశం అవుతోంది.
మరోవైపు గుంటూరు, చిత్తూరు, కడప జిల్లాల్లోని ఆరు మున్సిపాల్టీల్లోని వివిధ వార్డుల్లో సింగిల్ నామినేషన్ దాఖలు కావడంపై కలెక్టర్ల నుంచి ఎస్ఈసీ నివేదిక కోరింది. ఈ నెల 20లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. సీఎం సొంత నియోజకవర్గం పులివెందుల సహా రాయచోటి, మాచర్ల, పుంగనూరు, పలమనేరు, తిరుపతి కార్పోరేషన్లల్లోని వివిధ వార్డుల్లో సింగిల్ నామినేషన్ దాఖలయ్యాయి. పులివెందుల, రాటచోటిలో 21 వార్డులు, పుంగనూరులో 16, పలమనేరు, మాచర్లల్లో చెరో పది వార్డుల్లో సింగిల్ నామినేషన్ల దాఖలయ్యాయి. తిరుపతి కార్పోరేషన్లోని 6 డివిజన్లల్లో సింగిల్ నామినేషన్ దాఖలయినట్టు చెబుతున్నారు. వీటన్నటిపైనా కలెక్టర్ల నుంచి నివేదికలు వచ్చాక ఎస్ఈసీ తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com