మంత్రి కొడాలి నాని అత్తగారి ఊర్లో వైసీపీ బలపర్చిన అభ్యర్ధి ఓటమి

మంత్రి కొడాలి నాని అత్తగారి ఊర్లో వైసీపీ బలపర్చిన అభ్యర్ధి ఓటమి
ఆశించిన స్థానాల్లో టీడీపీ మద్దతుదారుల విజయం.. ఎన్టీఆర్‌ స్వగ్రామం నిమ్మకూరులో టీడీపీ బలపర్చిన అభ్యర్ధి గెలుపు

ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ మద్దతుదారుల హవా కనిపించింది. పలు జిల్లాల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థుల ఘన విజయం సాధించారు. మరికొన్ని చోట్ల పోటీ హోరాహోరీ అయింది. చిత్తూరు, అనంతపురం, గుంటూరు, కృష్ణా, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. చాలా చోట్ల గట్టి పోటీ ఇచ్చారు.

నెల్లూరు జిల్లా వింజమురు మండలం చాకలికొండ పంచాయతీలో టీడీపీ మద్దతుదారుడు సుబ్బలక్ష్మి గెలుపొందారు. సంగం మం వంగల్లులో టీడీపీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి కాళహస్తి రామయ్య విజయం సాధించారు. వీర్లగుడిపాడులో టీడీపీ బ‌ల‌ప‌రిచిన‌ అభ్యర్థి చెంచురత్నం నాయుడు విజయం సొంతం చేసుకున్నారు. దువ్వూరు సర్పంచ్‌గా టిడిపి మద్దతుదారు మారేళ్ల కృష్ణమ్మ గెలుపొందారు.

విజయనగరం జిల్లా సాలూరు మండలం కూర్మ రాజుపేట టీడీపీ బలపరిచిన ఆమదాల పరమేశ్, కురుపాం మండలం పెద్ద గొత్తిలి టిడిపి బలపరిచిన తాడంగి లోఖనాదం విజయం సాధించారు. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలం మల్లవరం గ్రామం టిడిపి మద్దతుదారు కోడూరు లక్ష్మి సుభాషిని భారీ మెజార్టీతో గెలుపొందారు.

అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం నిడిగల్లు టిడిపి అభ్యర్థి వెంగమ్మ నాయుడు గెలుపొందారు.

గంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెద్ద రెడ్డిపాలెంలోటీడీపీ మద్దతుదారు సర్పంచ్‌గా గెలిచారు. చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలోని చీకిలబైలు పంచాయితీ, కొత్తపల్లి గ్రామ పంచాయతీలలో టీడీపీ బలపరిచిన అభ్యర్ధులు విజయం సాధించారు. విజయనగరంజిల్లా పార్వతీపురం మండలం MR నగరం పంచాయతీలో బిజెపి అభ్యర్థి గెలుపొందారు.

కృష్ణా జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో... టీడీపీ హవా కొనసాగింది. ఎన్టీఆర్‌ స్వగ్రామం నిమ్మకూరులో టీడీపీ బలపర్చిన అభ్యర్థి దుర్గా శ్రీనివాసరావు విజయం సాధించారు. ముసక కవలపూడిలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి శ్యామలత, జువ్వనపూడిలో నెలపాల పెరేసు, నత్తగుల్లపాడులో రాంబాబు గెలుపొందారు. వానపాములలో పోతూరి రమేశ్‌, అనమనపూడిలో టీడీపీ సీతామహాలక్ష్మి, పురిపాడులో కాగిత నరేంద్ర టీడీపీ మద్దతుతో విజయం సాధించారు. దగ్గుమిల్లిలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. అటు.. మంత్రి కొడాలి నాని అత్తగారి ఊరిలో వైసీపీ బలపర్చిన అభ్యర్థి ఓడిపోయారు. పెదపారుపూడి మండలం యలమర్రులో టీడీపీ బలపర్చిన కొల్లూరి అనూష ఘన విజయం సాధించారు.

పోలింగ్‌, కౌంటింగ్‌ సందర్భంగా పలు చోట్ల ఘర్షణలు తలెత్తాయి. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం గొట్టిపాడులో టిడిపి బలపరిచిన సర్పంచి ముందుగా గెలిచారని చెప్పి అనంతరం వైసిపిదే గెలుపంటూ ప్రకటించడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

రొంపిచర్ల మండలం కర్లగుంటలో వైసీపీ రెబల్ అభ్యర్థి దేవుళ్ళ కోటేశ్వరవు.. వైసీపీ మద్దతుదారు వెంకటేశ్వరవుపై గెలుపొందాడు. రీ కౌంటింగ్‌లో వెంకటేశ్వరవుకి మెజార్టీ రావడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. వినుకొండ మండలం నడిగడ్డ పంచాయతీలోని బ్యాలెట్ పత్రాలను దుండుగులు ఎత్తుకెళ్లారు. అయితే ఈ విషయాన్ని జిల్లా స్థాయి అధికారులకు సమాచారం ఇచ్చి పోలింగ్‌కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది.

విజయనగరం జిల్లా కిష్టపల్లి గ్రామంలో పంచాయితీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా టీడీపీ- వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొంది. ఓటర్లకు తమ గుర్తులు చూపించి వైసీపీ కార్యకర్తలు ఓట్లు అడుగుతున్నారని టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పార్వతీపురం టీడీపీ నేత బొబ్బిలి చిరంజీవులు పోలింగ్‌ కేంద్రం వద్దకు చేరుకుని వైసీపీ కార్యకర్తల ఆగడాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రీకాకుళం జిల్లా మంచినీళ్లపేటలో గ్రామ పంచాయతీ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు బహిష్కరించారు. ఓటరు జాబితాలో 200కు పైగా ఓట్లను అదనంగా చేర్చడంతో టీడీపీ సానుభూతిపరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పంచాయతీ ఎన్నికల వేళ నెల్లూరు జిల్లాలో తన ఓటు మరొకరు వేయడంతో ఓ వ్యక్తి నిరసనకు దిగాడు. మర్రిపాడు మండలం నందవరం గ్రామంలో ఓ వ్యక్తి.. ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లాడు. తీరా అతని ఓటు అప్పటికే ఎవరో వేశారని అతడు గుర్తించాడు. దీంతో అతడు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలో నామినేషన్ల పత్రాలు గల్లంతయ్యాయి. దీంతో శ్రీకాళహస్తి ఎంపీడీవో కార్యాలయం ముందు అభ్యర్థులు నిరసనకు దిగారు. మూడవ విడతలో జరగాల్సిన పంచాయతీ ఎన్నికలకు గాను తొండమనాడు, గుట్టకిందపల్లి, ఓబులవారిపల్లి, రెడ్డిపల్లి గ్రామాల్లో సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలకు పలువురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అయితే ప్రస్తుతం నామినేషన్ పత్రాలు కనబడకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story