పంచాయతీ ఎన్నికల్లో గెలుపును వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది : టీడీపీ

పంచాయతీ ఎన్నికల్లో గెలుపును వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది : టీడీపీ
టీడీపీ మద్దతుదారులు గెలిచారని ప్రకటిస్తే చాలు ఏకంగా బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్తున్నారని ఆరోపిస్తున్నారు.

పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు గెలిచినా సరే.. అక్రమంగా పైచేయి సాధించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు టీడీపీ లీడర్లు. అవసరమైతే దాడులు చేయడానికి కూడా వెనకాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ మద్దతుదారులు గెలిచారని ప్రకటిస్తే చాలు ఏకంగా బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్తున్నారని ఆరోపిస్తున్నారు. బ్యాలెట్ బాక్సులకు నిప్పు పెట్టిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. అక్కడితేనే ఆగిపోకుండా.. ఏకంగా ఎన్నికల సిబ్బందిపై సైతం వైసీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారని ఆరోపించింది టీడీపీ. చాలా చోట్ల టీడీపీ మద్దతుదారులు గెలిచారని ఎన్నికల సిబ్బంది అధికారికంగా ప్రకటించినా సరే... వైసీపీ నేతలు అడ్డుపడుతున్నారని, పోలీసులు సైతం చూస్తూ ఉండిపోతున్నారని చెబుతున్నారు.

టీడీపీ మద్దతుదారులు గెలిచినా.. ఫలితాలను తారుమారు చేశారంటూ ఆందోళనకు దిగారు టీడీపీ నేతలు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం మారెళ్ల గ్రామంలో ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ రోడ్డుపై బైఠాయించారు టీడీపీ లీడర్లు. టీడీపీ నేతలకు తోడుగా గ్రామస్తులు సైతం అర్ధరాత్రి పోలింగ్ కేంద్రం దగ్గర ఆందోళనకు దిగారు. రీపోలింగ్ జరపాల్సిందేనంటూ స్థానిక మహిళలు సైతం ఆందోళన మొదలుపెట్టారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ గెలుపును జీర్ణించుకోలేని వైసీపీ.. దాడులకు తెగబడుతోందని విమర్శించింది టీడీపీ. వైసీపీ, టీడీపీకి జరిగిన ఘర్షణలో కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తి చనిపోయాడు. కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం ప్రాతకోటలో అర్ధరాత్రి ఆందోళనలు, గొడవలతో అట్టుడికిపోయింది. ఇక్కడి పంచాయతీలో టీడీపీ గెలవడంతో వైసీపీ రీకౌంటింగ్ కోరింది. దీంతో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ మొదలైంది. రెండు వర్గాలు ఆందోళనకు దిగడం, పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు.

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పులికొండలోనూ రాత్రంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పంచాయతీ ఎన్నికల్లో అధికారులు, పోలీసులు వైసీపీకి మద్దతుగా నిలిచారంటూ టీడీపీ వర్గీయులు ఆందోళనకు దిగారు. ఫలితాలు వెల్లడించకుండా ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య మాటామాటా పెరగడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడంతో టీడీపీ మద్దతుదారులకు గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన వారంతా పోలీసు జీపు ధ్వంసం చేశారు.

శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం కొండవలసలో ఉద్రిక్తత కొనసాగుతుంది. వైసీపీ మద్దతుదారులు 8 వార్డుల బ్యాలెట్‌ బాక్సులను తగలబెట్టారని టీడీపీ ఆరోపించింది. టీడీపీ మద్దతుదారులు ఎక్కడ గెలుస్తారోననే భయంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు చెబుతున్నారు. ఎన్నికల కోసం వచ్చిన అధికారులను, సిబ్బందిని కూడా నిర్బంధించారంటోంది టీడీపీ. టీడీపీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. దాదాపు 100 మంది వైసీపీకి చెందిన వారిని అదుపులోకి తీసుకున్నారు. కౌంటింగ్ ముగిశాక అధికారులు, సిబ్బందిని సురక్షితంగా ఊరు దాటించారు పోలీసులు.

మరోవైపు నిన్న మిస్సైన 8 బ్యాలెట్‌ బాక్సుల కోసం వెతుకుతున్నారు. వాటిలో రెండు బాక్సులను మాత్రమే పోలీసులు గుర్తించగలిగారు. పెంటకుప్పలో కాల్చేసిన రెండు బాక్సులను స్వాధీనం చేసుకున్నారు.


Tags

Read MoreRead Less
Next Story