AP Tax: ఏపీ ప్రజలకు భారం తెలియకుండా చెత్త పన్ను రాబట్టేందుకు ప్రభుత్వం ప్లాన్..

AP Tax: ఏపీ ప్రజలకు భారం తెలియకుండా చెత్త పన్ను రాబట్టేందుకు ప్రభుత్వం ప్లాన్..
AP Tax: ఏపీ ప్రజలకు భారం తెలియకుండా వారి నుంచి చెత్త పన్ను రాబట్టేందుకు ప్రణాళికలు వేస్తోంది ప్రభుత్వం.

AP Tax: ఏపీ ప్రజలకు భారం తెలియకుండా వారి నుంచి చెత్త పన్ను రాబట్టేందుకు ప్రణాళికలు వేస్తోంది ప్రభుత్వం. వసూళ్లు అంతంత మాత్రంగా ఉన్న చోట ఇళ్లకు ప్రజలు అర్ధ సంవత్సరానికి చెల్లిస్తున్న ఆస్తి పన్నును శ్లాబులుగా విభజించి వీటిపై చెత్త పన్ను విధించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని రాష్ట్రంలో పెద్ద నగరపాలక సంస్థల్లో ఒకటైన విశాఖలో మొదట అమలు చేయనున్నారు.

చెత్త పన్నుపై ప్రజలతో పాటు అధికార పార్టీ నాయకుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎలాగైనా దీన్ని వసూలు చేయాలనే తలంపుతో ముందుకెళుతోంది. ఇందులో భాగంగా పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ కొత్త ఆలోచన చేసింది. ఈ విధంగా చెత్త పన్ను వసూళ్ల లక్ష్యాలను చేరుకోవాలని ప్రణాళిక తయారు చేసింది. విశాఖలో మొదటగా అమలు చేయనుండగా.. అక్కడి పాలకవర్గం ఆమోదించింది.

నగరాలు, పట్టణాల్లో ఇళ్ల నుంచి తడి, పొడి చెత్త సేకరిస్తున్నందుకు పన్ను వసూలు చేయాలన్న నిర్ణయంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో పలు పుర, నగరపాలక సంస్థల్లో కనిష్టంగా 30, గరిష్టంగా 120 చొప్పున చెత్త పన్ను వసూలు చేయాలని పాలకవర్గాలు మొదట తీర్మానించాయి. ఆస్తి మూల ధన విలువ ఆధారంగా ఇప్పటికీ ఏటా 15శాతం చొప్పున ఆస్తి పన్ను పెంచుతున్నారు. దీనికి తోడు చెత్త పన్ను అనగానే ప్రజలు మండిపడుతున్నారు.

ఈ పరిణామాలతో సీఎం సొంత జిల్లా కడప నగరపాలక సంస్థలో పాలకవర్గంతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెత్త పన్ను వసూళ్లు నిలిపివేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. విశాఖలోనూ చెత్త పన్ను వసూళ్లు అంతంత మాత్రంగా ఉన్నాయి. గత ఆరు నెలల్లో 35 కోట్ల లక్ష్యంలో కేవలం 12 కోట్లే వసూలు చేయగలిగారు. ఎవరికీ మినహాయింపు లేదు.

విశాఖలో ఆస్తి పన్ను ఐదు శ్లాబ్‌లుగా విభజించారు. వీటిపై చెత్త పన్ను నెలకు ఎంత వసూలు చేయాలో నిర్ణయించారు. అర్ధ సంవత్సరానికి కనిష్టంగా 200 లోపు ఆస్తి పన్ను చెల్లించే కుటుంబాలు నెలకు 20 చొప్పున చెత్త పన్ను చెల్లించాలి. అర్ధ సంవత్సరానికి గరిష్టంగా 4 వేలు కంటే మించి ఆస్తి పన్ను చెల్లించే కుటుంబాలు చెత్త పన్ను 120 రూపాయలు చెల్లించేలా పాలకవర్గం తీర్మానించింది.

Tags

Read MoreRead Less
Next Story