AP: ఏపీ జిల్లాల్లో పోలింగ్ ఇలా...

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. పోలింగ్ ప్రశాంతగా జరిగేందుకు... హింసాత్మక ఘటనలకు ఆస్కారం లేకుండా భద్రతను కట్టుదిట్టం చేశామని జిల్లా అధికారులు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో మొత్తం 20 లక్షల 18 వేల మంది ఓటర్లు ఉన్నారు. వీరికోసం 2 వేల 236 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో 662 కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో 16 లక్షల 56 వేల మంది ఓటర్లుగా ఉన్నారు. ఇక్కడ మొత్తం 15 వందల 71 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అందులో 299 కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా పోలీసులు గుర్తించారు. వీటిపై కేంద్ర బలగాలతోపాటు, స్థానిక పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 20 వేల మంది, హిందూపురం పార్లమెంటు పరిధిలో 11 వేల 300 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి Y.S.R. జిల్లాలో 16 లక్షల 29 వేల మంది ఓటర్లున్నారు. 2 వెల 37 పోలింగ్ కేంద్రాల్లో జరిగే ఎన్నికల ప్రక్రియ కోసం 14 వేల మంది సిబ్బందిని అధికారులు నియమించారు. జిల్లాలోని 527 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించిన అధికారులు... కేంద్ర బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. దాదాపు 4 వేల మంది పోలీసులతో జిల్లా వ్యాప్తంగా బందోబస్తు నిర్వహిస్తుండగా... 900 మంది కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు.
నెల్లూరు జిల్లాలో మొత్తం ఓటర్లు 20 లక్షల 61 వేల 822 మంది ఉన్నారు. వీరికోసం 2 వేల 470 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 20 వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
ప్రకాశం జిల్లాలో ఉన్న ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో... మొత్తం 18 లక్షల 22 వేల 470 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరి కోసం మొత్తం 2 వేల 183 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 14 వేల 768 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. అవాంఛనీయ ఘటనులు జరగకుండా పోలీసులు పటిష్ఠబందోబస్తు ఏర్పాటు చేసారు.
పల్నాడు జిల్లాలో మొత్తం 17 లక్షల 20 వేల 526 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 19 వందల 29 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 15 వేల మంది పోలింగ్ 4 వేల మంది భద్రతా సిబ్బందిని నియమించారు. మరోవైపు నరసరావుపేటలో కేంద్ర బలగాలు కవాతు చేశాయి. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివశంకర్, ఎస్పీ బిందు మాధవ్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓటర్లలో భరోసా కలిగించేందుకే ఈ ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించామని కలెక్టర్, ఎస్పీ తెలిపారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు కోరారు.
N.T.R. జిల్లాలో మొత్తం 17 లక్షల 4వేల మంది ఓటర్లు ఉన్నారు. 17 వందల 92 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. విజయవాడ సెంట్లల్ నియోజకవర్గంలో 100 శాతం వెబ్ కాస్టింగ్ ఉంటుందని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. వృద్ధులు, వికలాంగుల కోసం కుర్చీలు, వీల్‌ఛైర్స్ అందుబాటులో ఉంచారు. పోలింగ్ స్టేషన్లకు ఓటర్లు మొబైల్ ఫోన్లు తీసుకురావొద్దని కలెక్టర్ సూచించారు. శాంతిభద్రతల విషయానికొస్తే జిల్లాలోని 332 ప్రాంతాలను సమస్యాత్మకమైనవిగా పోలీసులు గుర్తించారు. వీటిలో 267 ప్రాంతాలను శాంతిభద్రతల పరంగా సమస్యాత్మకంగా గుర్తించామని విజయవాడ సీపీ రామకృష్ణ తెలిపారు. ఈ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని రామకృష్ణ కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com