AP Power Crisis: ఏపీలో పవర్ కట్స్.. కానీ కరెంట్ బిల్లులు..

AP Power Crisis: ఏపీలో పవర్ కట్స్.. కానీ కరెంట్ బిల్లులు..
AP Power Crisis: ఏసీలు ఆపేయండి, టీవీలు, ఫ్యాన్లు గట్రా ఆఫ్ చేయండి లేదంటే కరెంట్‌ బిల్లుల మోతకు సిద్ధమవ్వండి.

AP Power Crisis: ఏసీలు ఆపేయండి, టీవీలు, ఫ్యాన్లు గట్రా ఆఫ్ చేయండి. కరెంట్‌ వాడకం తగ్గించండి లేదంటే కరెంట్‌ బిల్లుల మోతకు సిద్ధమవ్వండి. ఇదీ జగన్ ప్రభుత్వం ఏపీ ప్రజలకు ఇస్తున్న వార్నింగ్. బయటి నుంచి కరెంట్‌ కొనడానికి ఇబ్బంది లేదన్న జగన్ ప్రభుత్వం.. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ప్రజల నుంచే వసూలు చేస్తామని చెబుతోంది. ఓవైపు తెలంగాణలో కరెంట్‌ కోతలు లేకుండా పని సజావుగా సాగుతోంది.

కరెంట్ వాడకం తగ్గించండని గాని, మున్ముందు తిప్పలు తప్పవన్న ప్రకటనలు గాని తెలంగాణ ప్రభుత్వం నుంచి వినిపించడం లేదు. జగన్ ప్రభుత్వం మాత్రం చేతులెత్తేసింది. పనులు చూసుకుని ఇళ్లకు వచ్చి కాస్తంత సేదదీరేదే సాయంత్రం ఆరు గంటల నుంచి పదింటి వరకు కరెంట్ వాడకం తగ్గించాలని గృహ వినియోగదారులకు చెబుతున్నారు. దీనిపై ఏపీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇక టీడీపీ అయితే జగన్ పాలనపై ఏకిపారేస్తోంది.

జగన్‌కు పవర్ ఇస్తే.. జనాలకు పవర్ లేకుండా చేస్తున్నారంటూ.. ఏపీలో విద్యుత్ సంక్షోభంపై విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్లే ఏపీలో విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆరు సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ఏపీ ప్రజలపై 36 వేల కోట్ల భారం మోపారని జగన్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.

పైగా దక్షిణాదిలోని రాష్ట్రాలన్నింటితో పోల్చితే ఒక్క ఏపీలోనే విద్యుత్ చార్జీలు ఎక్కువగా ఉన్నాయని మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఎలాంటి విద్యుత్ చార్జీలు పెంచలేదని, పైగా పవన విద్యుత్, సోలార్ విద్యుత్ తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు చంద్రబాబు. జగన్ పాలనలో బొగ్గుకు కూడా డబ్బులు కట్టలేని పరిస్థితి ఉందని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. బయటి నుంచి కరెంట్‌ కొంటే కమీషన్లు వస్తాయన్న ఉద్దేశంతోనే జగన్ ప్రభుత్వం కృత్రిమ విద్యుత్ కొరత సృష్టించిందని ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యుదుత్పత్తి ప్లాంట్ల సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేయిస్తే, బహిరంగ మార్కెట్లో యూనిట్‌కు 20 రూపాయలు పెట్టి కొనాల్సిన అవసరమే రాదని చంద్రబాబు స్పష్టం చేశారు. ముందుగా డిస్కంలకు ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు బకాయి ఉన్న 22 వేల కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఏపీలో విద్యుత్‌ సంక్షోభంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ బహిరంగ లేఖ రాశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్‌ చార్జీలు పెంచబోమని హామీ ఇచ్చి.. తీరా అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో ఆరుసార్లు చార్జీలు పెంచారని విమర్శించారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో మిగులు విద్యుత్‌తో నాణ్యమైన విద్యుత్‌ 24 గంటలూ సరఫరా చేశామని గుర్తు చేశారు.

జగన్‌ పాలనలో ఓవైపు విద్యుత్‌ కోతలు-మరోవైపు బిల్లుల వాతలు అంటూ క్యాప్షన్‌ పెట్టి మరీ విమర్శలు గుప్పించారు. వెంటనే విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని, కుప్పకూలిన విద్యుత్‌ రంగాన్ని గాడిలో పెట్టాలని డిమాండ్‌ చేశారు నారా లోకేశ్‌. దేశవ్యాప్తంగా యూనిట్‌ విద్యుత్‌ 3 రూపాయలకే వస్తుంటే.. జగన్ ప్రభుత్వం మాత్రం ఒక్కో యూనిట్‌ని 20 రూపాయలకు ఎందుకు కొనుగోలు చేస్తోందో చెప్పాలని నిలదీశారు.

ప్రతి యూనిట్‌కి అదనంగా 16 రూపాయలకు పైగా పెడుతున్న సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళుతోందో జగన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. డిస్కంలకు బకాయిపడ్డ 12 వేల కోట్లు, ప్రభుత్వరంగ సంస్థలకు ఇవ్వాల్సిన 10వేల 800 కోట్లు చెల్లిస్తే విద్యుత్‌ రంగం కుప్పకూలే దుస్థితి వచ్చేది కాదన్నారు నారా లోకేశ్.

ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించి, పెంచిన ఛార్జీలు తగ్గించాలన్నారు. ఓవైపు అధిక ధరలకు కరెంట్ కొంటూ.. ట్రూఅప్‌ పేరుతో మరోసారి ఛార్జీలు పెంచే ప్రయత్నాన్ని విరమించుకోవాలని హెచ్చరించారు. నిరుపేదల ఇంట్లో ఫ్యాన్‌కే గతి లేకపోతే ఏసీలు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story