AP PRC: ఉద్యోగసంఘాలను తీవ్రంగా నిరాశపరిచిన జగన్.. కోరినట్టు పీఆర్‌సీ ఇవ్వలేమంటూ..

AP PRC: ఉద్యోగ సంఘాల ఆశలపై జగన్ సర్కారు మరోసారి నీళ్లుజల్లింది. మొదటి మీటింగ్ లోనే ఉద్యోగసంఘాలను తీవ్రంగా నిరాశపరిచారు సీఎం జగన్. ఉద్యోగులు 55శాతం ఫిట్మెంట్ కోరుతుంటే.. దాన్ని 15శాతానికే కుదించి తీవ్రంగా నిరాశపరిచారు. ఆర్థికశాఖ ప్రతిపాదన మేరకు 14.29 శాతమే ఫిట్మెంట్ ఇస్తామని సీఎం తేల్చిచెప్పారు.
PRC విషయంలోనూ సర్కారు చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. ఉద్యోగ సంఘాలు కోరినట్లు PRC అమలు చేయలేమని సీఎం జగన్ స్పష్టం చేశారు. PRC అమలుతో ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందన్నారు. అసలే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయన్నారు సీఎం. పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని, ప్రాక్టికల్ గా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. తనను ఓ కుటుంబ సభ్యుడిగా భావించి సహకరించాలన్నారు. రెండుమూడు రోజుల్లోనే PRCపై నిర్ణయం ఉంటుందన్నారు జగన్.
గత ప్రభుత్వాల్లో ఆర్థికశాఖ ప్రతిపాదించినదానికంటే ఎక్కువ ఫిట్మెంట్ ఇచ్చిన సంఘటనలు సీఎం దృష్టికి తీసుకెళ్లాయి ఉద్యోగసంఘాలు. తెలంగాణ ప్రభుత్వంతో పోల్చుకుంటే మెరుగ్గా మన ఉద్యోగులకు ఫిట్మెంట్ ఇవ్వాలని కోరామన్నారు JAC నేతలు.
ఓవైపు తేడావస్తే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ఉద్యమానికి వెళ్తామని ఉద్యోగసంఘాలు అంటుంటే.. మరోవైపు ఫిట్‌మెంట్ విషయంలో అంచనాలకు దూరంగా బేరాలాడుతోంది ప్రభుత్వం. రెండురోజుల్లో సర్కారు నుంచి వచ్చే ప్రకటనపై ఉద్యోగసంఘాలు ఎలా స్పందింస్తాయనేది ఆసక్తిగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com