AP PRC: ఏపీ ఉద్యోగ సంఘాలతో సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు.. అయినా సీఎంతోనే తేల్చుకుంటామంటూ..

AP PRC: ఏపీలో పీఆర్సీ రగడ కొనసాగుతూనే ఉంది. తమతో సంప్రదించకుండానే కార్యదర్శుల కమిటీ పీఆర్సీ రిపోర్టు ప్రకటించడంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర స్థాయిలో ఫైరవుతున్నాయి. దీంతోపాటు ముఖ్యమంత్రి ముందు సీఎస్ ఉంచిన ప్రతిపాదనలనూ వారు తప్పు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై చర్చలు జరిపారు.. ఉద్యోగ సంఘాలతో సజ్జల విడివిడిగా చర్చించారు.
ఈ సందర్భంగా వారి డిమాండ్లను మరోసారి సజ్జల ముందుంచారు ఉద్యోగ సంఘాల నేతలు. సీఎస్ కమిటీ సిఫార్సులను వ్యతిరేకిస్తున్నామని ఆయన ముందు కుండ బద్దలు కొట్టారు.. అధికారుల కమిటీ సిఫార్సులు ఏపీ ఉద్యోగులు ఆశించిన రీతిలో లేవన్నారు.. మెజారిటీ ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. తాము 60 శాతం పీఆర్సీ కోరుతుంటే.. కనీసం 55 శాతానికైనా నిర్ణయం తీసుకోకుండా కేంద్ర వేతన సంఘం సిఫార్సులు అమలు చేస్తామనడంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.
సీఎం జగన్‌పై తాము నమ్మకంతో ఉన్నామని వారంతా చెప్తున్నారు. సీఎస్ ఇచ్చిన ప్రతిపాదనలు మాకు మేలు చేసేలా లేవన్నారు.. ఈ ప్రతిపాదనలు అమలు చేస్తే ఉద్యోగుల ఉనికే ప్రశ్నార్థకం అవుతుందన్నారు. 14.29 శాతం ఫిట్‌మెంట్‌తో 13 లక్షల ఉద్యోగులు నష్టపోతారని సజ్జలకు చెప్పామన్నారు ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు.. హామీల అమలుపై అగ్రిమెంట్ రూపంలో ఇస్తే తప్పకుండా ఉద్యమంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఈ రెండు జేఏసీలు ఇలా అంటుంటే.. సచివాలయ ఉద్యోగుల సంఘం మాత్రం ఇందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేస్తోంది.. సీఎస్ కమిటీ సిఫార్సులు నచ్చలేదంటూనే 34 శాత తగ్గకుండా ఫిట్‌మెంట్ ఇవ్వాలని సజ్జలను కోరినట్లు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చెప్పారు.. ఐఆర్ కంటే తక్కువ ఫిట్‌మెంట్ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు.. ముఖ్యమంత్రి మంచి ఫిట్‌మెంట్ ఇస్తారని భావిస్తున్నామన్నారు.
అటు ఉద్యో సంఘాలతో చర్చల తర్వాత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు.. ఉద్యోగ సంఘాల డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది.. ఇక ఇదే అంశంపై బుధవారం ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com