AP SPEAKER: వైసీపీ ఎమ్మెల్యేలపై రాజ్యాంగబద్ద చర్యలు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకు రాని వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు చర్యలకు సిద్దమవుతున్నారు. రాజ్యాంగ బద్దంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని 10 మంది YSRCP ఎమ్మెల్యేలు ప్రతి నెల జీతాలు తీసుకుంటున్నారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే జీతం తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ విషయంపై రాజ్యాంగ బద్ధంగా చర్యలు తీసుకుంటామని, అసెంబ్లీలో చర్చలు జరిపిస్తానని స్పీకర్ స్పష్టం చేశారు. . జీతం తీసుకుని డ్యూటీ చేయకపోతే ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నామని, ఉద్యోగం నుంచి తీసేస్తున్నామని చెప్పుకొచ్చారు. అటువంటిది ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. అసలు కోడికి గుడ్డు కి తేడా తెలియని వైసీపీ వాళ్ల గురించి మాట్లాడటం వేస్ట్ అంటూ ఆయన మండిపడ్డారు. రాష్ట్ర రాజకీయాలు భ్రష్టు పట్టాయని, రాజకీయాలు కాస్ట్లీగా మారిపోయాయని కూడా వ్యాఖ్యానించారు. ఈ విషయంపై అసెంబ్లీలో చర్చలు జరగనున్నాయని, ప్రజల సమస్యలపై చర్చించాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలకు సూచించారు. ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడంపై అసెంబ్లీలో చర్చించి ఎమ్మెల్యేల జీతాలు ఆపివేయడం లేదా సస్పెన్షన్లు విధించడం వంటివి జరగవచ్చు. ఈ మధ్య అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకుండా, ప్రజల సమస్యలు చర్చించకపోవడం పట్ల టీడీపీ నేతలు కూడా తీవ్ర విమర్శల చేస్తున్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు గతంలో కూడా వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేసి, మంత్రులు, ఎమ్మెల్యేలపై చురకలు వేసిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి జీతాల విషయం కీలకంగా మారింది.
రోజాపై హాట్ కామెంట్స్
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత ఆర్కే రోజాపై హాట్ కామెంట్లు చేశారు అయ్యన్నపాత్రుడు.. రోజా మాటలు వింటే మగవాళ్లే సిగ్గు పడతారన్న ఆయన.. అటువంటివి అన్నీ సెల్ ఫోన్ ల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నాయి.. సినిమాలకు సెన్సార్ ఉన్నట్టే సెల్ ఫోన్లు కు కూడా సెన్సార్ ఉండాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. ఆ దిశగా మేధావులు పిల్ దాఖలు చేయాలని సూచించారు. మరోవైపు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రతిపక్షంగా మారింది. కానీ పది శాతం సీట్లు రాకపోవడంతో ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్ న్యాయపోరాటం చేస్తున్నారు. కానీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు అంగీకరించడం లేదు. దీంతో వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు బాయ్‌కాట్ చేస్తోంది. ఈ క్రమంలో 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ సహా హాజరు కావడం లేదు. జగన్ తన జీతాన్ని తీసుకోవడం లేదని, మిగిలిన 10 మంది తీసుకుంటున్నారని స్పీకర్ చెప్పారు.
"జగన్‌ది రాజకీయ డ్రామా"
మాజీ సీఎం వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిందని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. జగన్ పర్యటనలో ఎక్కడా కూడా రైతులు కనిపించలేదన్నారు. తాను పర్యటిస్తున్న ప్రాంతాల్లో రైతులు లేక పక్క గ్రామాల నుంచి రైతులను తెప్పించుకుని జగన్ పబ్లిసిటీ స్టంట్లు చేశారని విమర్శించారు. పొలం గట్ల మీద నడిచి ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారని కామెంట్స్ చేశారు. తుఫాను తీరం దాటిన తొమ్మిది రోజుల తర్వాత పరామర్శ పేరుతో జగన్ రాజకీయ డ్రామా సృష్టించారని వ్యాఖ్యలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

