AP SSC Result 2022: టెన్త్‌ ఫలితాల్లో ఫెయిలయింది ఏపీ ప్రభుత్వమేనా..?

AP SSC Result 2022: టెన్త్‌ ఫలితాల్లో ఫెయిలయింది ఏపీ ప్రభుత్వమేనా..?
AP SSC Result 2022: ఏపీలో టెన్త్‌ పరీక్షల్లో 2 లక్షల మందికిపైగా విద్యార్థులు ఫెయిల్‌ కావడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

AP SSC Result 2022: ఏపీలో టెన్త్‌ పరీక్షల్లో 2 లక్షల మందికిపైగా విద్యార్థులు ఫెయిల్‌ కావడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.. ఫెయిల్‌ అయ్యామన్న మనస్తాపంతో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కూడా కలకలం రేపుతోంది.. ఈ ఫలితాలు ప్రభుత్వ వైఫల్యమేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.. టెన్త్‌ ఫలితాల్లో 2 లక్షలమంది విద్యార్ధులు ఫెయిల్‌ కావడానికి జగన్‌ సర్కారు కారణమంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ చెప్పిన నాడు - నేడు అంటే.. 2 లక్షల మంది విద్యార్ధులు ఫెయిల్‌ అవ్వడమేనా అని ప్రశ్నించారు.

నాడు-నేడు అంటూ మూడేళ్లుగా ప్రభుత్వం చేసిన.. ఆర్భాటపు ప్రచారానికి, పదోతరగతి ఫలితాలకు పొంతనే లేదని ఎద్దేవా చేశారు. టీడీపీ హయంలో 90-95శాతం ఉన్న ఉత్తీర్ణత.. ఇప్పుడు 67శాతానికి పడిపోయిందని రాష్ట్రంలో పాఠశాల విద్యా వ్యవస్థ దుస్థితికి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు.. 2 లక్షల మందికి పైగా విద్యార్ధులు ఓ విద్యా సంవత్సరాన్ని కోల్పోయే పరిస్థితికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు చంద్రబాబు. ఇక్కడ ఫెయిల్‌ అయింది విద్యార్ధులు కాదని.. ప్రభుత్వ వ్యవస్థలేనన్నారు చంద్రబాబు.

పరీక్షల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ లేకపోవడం, వారికి బోధనేతర పనులు అప్పగించడం, బడుల విలీనం సహా ప్రభుత్వం తీసుకున్న పలు అస్తవ్యవస్త విధానాల వల్లే విద్యార్ధులు తీవ్రంగా నష్టపోయారన్నారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థను సర్వనాశనం చేసిందన్నారు టీడీపీ సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర. టెన్త్‌ ఫలితాల్లో దశాబ్దకాలంలో ఇంతటి వైఫల్యం చూడలేదన్నారు. విద్యామంత్రి నైతిక బాధ్యత వహించకుండా తల్లిదండ్రులపై నెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు విజనరీ సీఎం అయింతే. జగన్‌ ప్రిజనరీ సీఎం అంటూ విమర్శించారు.

అటు విద్యార్థి సంఘాలు కూడా ప్రభుత్వ తీరునే తప్పు పడుతున్నాయి.. ప్రభుత్వ స్కూళ్లపై అధికారుల పర్యవేక్షణ లోపించిందనడానికి ఈ ఫలితాలే ప్రత్యక్ష నిదర్శనమన్నారు.. ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచడం, సర్వేల పేరుతో వారిని ఇబ్బందులకు గురి చేశారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు.. మొత్తంగా టెన్త్‌ పరీక్షా ఫలితాల్లో ఫెయిల్‌ అయింది విద్యార్థులు కాదని, ప్రభుత్వమేనని విమర్శలు వస్తున్నాయి.. బాధిత విద్యార్థులకు న్యాయం చేసే వరకు పోరాడతామని టీడీపీ నేతలు చెప్తుంటే, ప్రభుత్వం దిగివచ్చే వరకు ఆందోళనలు చేపడతామని విద్యార్థి సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story