పోలీస్‌ వాహనాలకు వైసీపీ రంగులు వేయడంపై అచ్చెన్న ఆగ్రహం

పోలీస్‌ వాహనాలకు వైసీపీ రంగులు వేయడంపై అచ్చెన్న ఆగ్రహం
ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పుపట్టింది. అయినప్పటికీ, జగన్ ప్రభుత్వం బుద్ది మారలేదు

పోలీస్‌ వాహనాలకు వైసీపీ రంగులు వేయడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఏపీ డీజీపీకి లేఖ రాశారు. పోలీస్ షీ టీమ్ వాహనాలకు వైసీపీ రంగులు వేయడమే కాకుండా.. ప్రభుత్వ అధికారే వాటిని ప్రారంభించి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడ్డారంటూ డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు.

ఏపీలో మహిళల రక్షణ కోసం టీడీపీ హయాంలోనే షీటీమ్స్‌ను బలోపేతం చేసిందన్న అచ్చెన్నాయుడు.. ఆనాడే దాదాపు 800 వాహనాలకు పైగా సమకూర్చామని గుర్తు చేశారు. ఆనాడు టీడీపీ కొనుగోలు చేసిన షీటీమ్స్‌ వెహికల్స్‌కే.. నేడు వైసీపీ రంగులు అద్ది తిరిగి పంపిణీ చేశారని విమర్శించారు.

ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పుపట్టింది. రంగుల కోసం 3500 కోట్ల రూపాయల ప్రజా ధనం వృధా చేశారు. అయినప్పటికీ, జగన్ ప్రభుత్వం బుద్ది మారలేదని.. మళ్లీ మళ్లీ అవే తప్పులు చేస్తున్నారని మండిపడ్డారు అచ్చెన్న. 24 గంటలూ శాంతిభద్రతలను కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులకు.. రాజకీయ ముద్ర వేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ షీటీమ్స్ వాహనాలకు వైసీపీ రంగులు వేసి.. వాటిని ప్రచార రథాలుగా మార్చడాన్ని తప్పుపట్టారు అచ్చెన్నాయుడు. పోలీస్ వ్యవస్థపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.


Tags

Read MoreRead Less
Next Story