AP: ఏపీలో ఉపాధ్యాయ సంఘాల నిరసన దీక్ష

AP: ఏపీలో ఉపాధ్యాయ సంఘాల నిరసన దీక్ష
X
బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌... బకాయిల చెల్లింపులో జగన్‌ సర్కార్‌ విఫలమైందని విమర్శ....

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ U.T.F. ఆధ్వర్యంలో ఏపీ వ్యాప్తంగా ఉపాధ్యాయులు దీక్షలు కొనసాగిస్తున్నారు. నాలుగు రోజుల పాటు దీక్షలు కొనసాగుతాయని... ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రకటించారు. బకాయిలు చెల్లించాలని జగన్‌ ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా చలనం లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక బకాయిలు చెల్లించడంలో సర్కార్‌ పూర్తిగా విఫలమైందని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరాహార దీక్షకు దిగారు.


తామేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని కర్నూలు ధర్నాచౌక్ వద్ద ఆందోళన చేశారు. ప్రభుత్వం పీఆర్సీ కమిటీని వేసినా... దానికి విధివిధానం లేకుండా పోయిందని మండిపడ్డారు. శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. జగన్‌ సర్కార్‌.... ఫ్రెండ్లీ ప్రభుత్వమంటూనే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.


విజయనగరం కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్షకు దిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ మొండి వైఖరిని ఖండించారు. తామేమీ వేతనాలు పెంచమని కోరడం లేదని... జీతం నుంచి దాచుకున్న సొమ్మునే ఇవ్వమని అడుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు విడుదల చేయాలని కడప కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. ఎన్నికల ముందు టీచర్ల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్‌... అందలమెక్కాక మడమ తిప్పేశారని విమర్శించారు. ఉపాధ్యాయుల సమస్యల్ని పరిష్కరించే వరకు ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Tags

Next Story