దేవాలయాల కూల్చివేతలను ఖండిస్తూ..కపిలతీర్థం నుంచి రామతీర్థం వరకూ యాత్ర

దేవాలయాల కూల్చివేతలను ఖండిస్తూ..కపిలతీర్థం నుంచి రామతీర్థం వరకూ యాత్ర
ఫిబ్రవరి 4న కపిలతీర్థం నుంచి రామతీర్థం వరకూ యాత్ర చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు.

ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జరుగుతున్న పరిణామాలు, తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం వంటి ఘటనలతోపాటు హిందూ మతం టార్గెట్‌గా కుట్రలు జరుగుతున్నాయంటూ ధార్మిక సంఘాలు, విపక్షాల నుంచి సైతం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల్లో వస్తున్న ఈ వ్యతిరేకతను తమకు ప్లస్‌గా మార్చుకునేందుకు బీజేపీ ట్రై చేస్తోంది.. ప్రభుత్వ నిర్ణయాలను ఎప్పటికప్పుడు తప్పుపడుతూ వస్తున్న బీజేపీ నేతలు.. హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నారు.

అటు విశాఖలో జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలోనూ అనేక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్ దేవధర్‌ నేతృత్వంలో జరిగిన సమావేశంలో పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో సహా కీలక నేతలు హాజరయ్యారు. ముఖ్యంగా దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులపై దీటుగా స్పందించాలని నిర్ణయించారు. గత 19 నెలలుగా దాడులు జరుగుతున్నా.. ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు మండిపడ్డారు. అసలు దోషులను పట్టుకోకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు.

రాష్ట్రంలో దేవాలయాల కూల్చివేతలను ఖండిస్తూ వచ్చేనెలలో యాత్ర చేపట్టనున్నారు బీజేపీ నేతలు.. ఫిబ్రవరి 4న కపిలతీర్థం నుంచి రామతీర్థం వరకూ యాత్ర చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ఎక్కడైతే దేవాలయాలకు నష్టం జరిగిందో వాటన్నింటినీ కలుపుతూ యాత్ర సాగుతుందని చెప్పారు. హిందుత్వానికి జరుగుతున్న విఘాతంపై పోరాడతామన్నారు. యాత్ర ప్రజల హృదయాల్లోకి వెళ్లే వరకూ చేస్తామన్నారు. వారం పాటు యాత్ర సాగుతుందని సోము వీర్రాజు చెప్పారు.

అటు డీజీపీ చేసిన వ్యాఖ్యలపైనా బీజేపీ నేతలు మండిపడుతున్నారు.. దేవాలయాలపై దాడుల వెనక టీడీపీ, బీజేపీ ఉందన్న డీజీపీ వ్యాఖ్యలను వారు ఖండించారు. హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా డీజీపీ పనిచేస్తున్నారా అని ప్రశ్నించారు. స్థాయి మరిచి మాట్లాడుతున్న డీజీపీని వెంటనే తొలగించాలని వారంతా డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story