AP: త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

AP: త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
X
కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ రవాణమంత్రి రాంప్రసాద్‌రెడ్డి... అధ్యయనం చేస్తున్నామని వెల్లడి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులేస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు అయిదు కీలక హామీలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేసిన క్రమంలో వాటి అమలుపై దిశగా కసరత్తు మొదలైంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకంపై ఇప్పటికే కసరత్తు చేస్తున్నామని, త్వరలోనే అమలు చేస్తామని అన్నారు. తెలంగాణ, కర్ణాటకలో అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణంలో ఎదురవుతున్న లోటుపాట్లు ఏపీలో తలెత్తకుండా చూస్తున్నామని అన్నారు. రెండు రాష్ట్రల్లో అధ్యయనం చేసిన అనంతరం ఎప్పుడు అమలు చేయబోయేది ప్రకటిస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ వెల్లడించారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా మహిళలకు ఉపయోగపడేలా ఈ పథకాన్ని అమలు చేస్తామని అన్నారు. అన్నీ అనుకూలిస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఆగస్టు 15 నుంచి అమలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇవాళే కీలక నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినేట్‌ భేటీ జరగనుంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న ఇదే తొలి మంత్రివర్గ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలిపేలా వైట్‌ పేపర్ విడుదలకు సంబంధించి ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా డీఎస్సీ, ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు, పింఛను మొత్తం రూ.4 వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై చంద్రబాబు అయిదు సంతకాలు చేశారు. ఇవాళ్టీ మంత్రివర్గ సమావేశంలో వీటికి ఆమోదం తీసుకునే అవకాశం ఉంది.

సూపర్‌ 6 పథకాల అమలు, అందుకు అనుగుణంగా బడ్జెట్‌ రూపకల్పనపైనా మంత్రివర్గంలో చర్చిస్తారని తెలుస్తోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టాక పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధానిలో చంద్రబాబు పర్యటించారు. మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టుల పరిస్థితి, పూర్తి చేసేందుకు నిధుల సమీకరణపైనా చర్చించనున్నట్లు తెలిసింది. జులై నెలాఖరులోగా పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెట్టాల్సి ఉంది. కొత్త బడ్జెట్‌ తయారీలో ప్రాధాన్య అంశాలపైనా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఎసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లపైనా వివరాలు తెప్పిస్తున్నారు. వాటిని కూడా మంత్రివర్గం ముందుంచి ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.


Tags

Next Story