APSRTC Charges: మరోసారి ఏపీఎస్‌ఆర్టీసీ ఛార్జీల బాదుడు.. నేటి నుండే అమలు..

APSRTC Charges: ఇప్పటికే రక రకాల పన్నులతో జనాన్ని బాదేస్తున్న జగన్ సర్కారు కన్ను.. ఇప్పుడు ఆర్టీసీ మీద పడింది. డీజిల్ సెస్ పెంపు పేరుతో.. ఆర్టీసీ ఛార్జీలను పెంచింది. పల్లె వెలుగు బస్సుల్లో ప్రస్తుతం కనీస ఛార్జీ రూ.10లుగా ఉంది. తొలి 30 కి.మీ వరకు సెస్ పెంపు లేదని ఆర్టీసీ స్పష్టం చేసింది. 35 నుంచి 60 కి.మీ వరకు అదనంగా రూ.5లు సెస్ విధించారు. 60 నుంచి 70 కి.మీ వరకు రూ.10 సెస్ వసూలు చేస్తారు.
ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల్లో ప్రస్తుతం టికెట్‌పై రూ.5లు సెస్ వసూలు చేస్తున్నారు. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 30కి.మీ వరకు సెస్ పెంపు లేదు. 31 నుంచి 65 కి.మీ వరకు మరో రూ.5 సెస్ వసూలు చేస్తారు. 66 నుంచి 80కి.మీ వరకు రూ.10 పెంచారు. సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో టికెట్‌పై రూ.10 డీజిల్ సెస్ వసూలు చేస్తున్నారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో 55 కి.మీ వరకు సెస్ పెంపు లేదు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ.70 సెస్ పెంచారు.
హైదరాబాద్ వెళ్లే అమరావతి బస్సుల్లో రూ.80 చొప్పున డీజిల్ సెస్ విధించారు. డీజిల్ సెస్ పెంపుతో ఛార్జీలు పెంచక తప్పలేదంటున్నారు ఆర్టీసీ ఉన్నతాధికారులు. అయితే డీజిల్ సెస్ పెంపు నుంచి సిటీ బస్సులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. పెంచిన ఛార్జీలు ఇవాల్టి నుంచి అమల్లోకి వస్తాయి. డీజిల్ సెస్ పెంపుతో ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ ఛార్జీలను పెంచింది. దీంతో హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికులు ఇతర రాష్ట్రాల ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తుండటంతో తెలంగాణకు బస్సులు నడిపించే ఆర్టీసీ సంస్థలకు సర్క్యూలర్ ఇచ్చింది టీఎస్‌ఆర్టీసీ.
అంతర్‌రాష్ట్ర రవాణా సంస్థల ఒప్పందం ప్రకారం ఆయా రాష్ట్రాల మధ్య తిరిగే బస్సు ఛార్జీలు ఒకేలా ఉండాలనే నిబంధన పెట్టాలని అందులో పేర్కొంది. అయితే.. ప్రభుత్వంలో విలీనం కావడంతో తెలంగాణ ప్రాంతంలో తిరిగే ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల ఛార్జీలపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని అప్పట్లో చెప్పింది ఏపీఎస్‌ఆర్టీసీ. అయితే.. ఇప్పుడు ఆ మాట మార్చేసింది. డీజిల్ సెస్ పెంపు పేరుతో బస్సు ఛార్జీల ధరలు పెంచింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com