APSRTC : ఏపీలో నేటి నుంచి ఆర్టీసీ ఛార్జీలు పెంపు..!

APSRTC : ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ మరో షాక్ ఇచ్చింది. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ప్రయాణికులపై డీజీల్ సెస్ విధించారు. పెంచిన ధరలు నేటి నుంచే అమలవుతున్నాయి. డీజిల్ ధరలు విపరీతంగా పెరగడం వల్ల సంస్థ నష్టాల్లో ఉందన్నారు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు.
నష్టాల నుంచి కొంత మేర ఉపశమనం కోసమే డీజిల్ సెస్ పెంచుతున్నట్లు చెప్పారు. పల్లె వెలుగు బస్సుల్లో కనీస ఛార్జీ ఇకపై పది రూపాయలుగా ఉండనుంది.. అలాగే ఎక్స్‌ప్రెస్ సర్వీసులపై ఐదు రూపాయలు... ఏసీ బస్సుల్లో డీజిల్ సెస్ కింద 10 రూపాయలు పెంచుతున్నట్లు తెలిపారు. అయితే, టికెట్ రేట్లు పెంచలేదని.. డీజిల్ సెస్ మాత్రమే పెంచామని ఆర్టీసీ ఎండీ అంటున్నారు.
ఆర్టీసీ చార్జీలు పెంపునకు నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. నియోజకవర్గాలు, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో ఆర్టీసీ బస్ స్టేషన్లు, బస్ కాంప్లెక్స్‌లు, బస్ డిపోలు ఎదురుగా నిరసనలు తెలపాలని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సూచించారు. జగన్ రెడ్డి బాదుడే బాదుడు చర్యలతో ప్రజలు విలవిల్లాడుతున్నారని చంద్రబాబు అన్నారు.
ఆర్టీసీ ఛార్జీల పెంపుతో ప్రజలపై తీవ్ర భారం పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. డీజిల్ సెస్ పేరుతో ఛార్జీల పెంపును వెనక్కి తీసుకోవాలన్నారు. వైసీపీ పాలనలో రెండోసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచారని చంద్రబాబు గుర్తు చేశారు. విలీనం అయ్యాక ఆర్టీసీకి అండగా నిలవాల్సింది ప్రభుత్వమేనన్నారు.
ప్రతివారం ఛార్జీలు, పన్నులు పెంచడం అలవాడుగా మారిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికే విద్యుత్, చెత్త, ప్రాపర్టీపై పన్నుల భారం వేశారని, పెరిగిన నిత్యావసరాల ధరలతో ప్రజలు అల్లాడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com