ATTACK: హారన్‌ కొట్టాడని ఆర్టీసీ డ్రైవర్‌పై మూక దాడి

ATTACK: హారన్‌ కొట్టాడని ఆర్టీసీ డ్రైవర్‌పై మూక దాడి
నిందితుల్లో వైసీపీ కార్పొరేటర్‌ ఉన్నాడన్న బాధితుడు..... కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌..

నెల్లూరు జిల్లా కావలిలో RTC డ్రైవర్ పై 14మంది మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఉదాంతాన్ని బస్సులోని ఓ ప్రయాణికుడు వీడియో తీస్తుండగా అతనిపైనా దాడికి పాల్పడి ఫోన్ లాక్కొని ధ్వంసం చేశారు. విజయవాడ డిపోకు చెందిన RTC బస్సు కావలి నుంచి విజయవాడకు వెళ్తుంది. కావలిలోని ట్రంకురోడ్డులో బస్సు ముందున్న బైకును అడ్డు తీయాలని డ్రైవర్ రాంసింగ్ హారన్ మోగించారు. దీంతో బస్సు డ్రైవర్ తో ద్విచక్రదారుడు వాగ్వాదానికి దిగగా పోలీసులు వారికి సర్దిచెప్పి పంపించారు. తర్వాత ద్విచక్రదారుడు అతని స్నేహితులతో బస్సును వెంబడించి పట్టణ శివారులో బస్సును అడ్డుకొని డ్రైవర్ ను దుర్భాషలాడుతూ దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. డ్రైవర్ ను కావలి ప్రాంతీయాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దారుణ ఘటన దృశ్యాలుసామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి.


బెంగళూరు నుంచి విజయవాడ వస్తున్న RTC బస్సు గురువారం సాయంత్రం కావలి నుంచి గమ్యస్థానానికి బయలుదేరింది. ట్రంకురోడ్డు మీదుగా వెళుతున్నప్పుడు ఓ ద్విచక్ర వాహనం రోడ్డుకు అడ్డుగా ఉండటంతో బస్సు డ్రైవరు B.R. సింగ్‌ హారన్‌ మోగించారు. దాంతో ఆ వాహనదారుడు డ్రైవరుతో వాదనకు దిగాడు. ఆ సమయంలో వెనుకవైపు ఆగిన వాహనాలు హారన్‌ మోగించడం, అక్కడే ఉన్న ఒకటో పట్టణ పోలీసులు స్పందించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత తన మిత్రులైన దేవరకొండ సుధీర్‌ తదితరులకు సెల్‌ఫోన్‌ ద్వారా విషయం తెలిపాడు. మొత్తం 14 మంది... కారులో ఆర్టీసీ బస్సును వెంబడించి అడ్డుకున్నారు. డ్రైవరును కిందకి దించి విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. ఇక్కడే చంపి పాతిపెడతాం.. ఎవరొస్తారో చూస్తామంటూ బెదిరింపులకు తెగబడ్డారు. ఆ సమయంలో అస్వస్థతకు గురై డ్రైవరు కిందపడినా.. వదిలిపెట్టలేదు. ఆ దారుణ ఘటనను చిత్రీకరిస్తున్న వారి ఫోన్లనూ లాక్కున్నారు.


సమాచారమందుకున్నపోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్‌ను కావలి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనలో దేవరకొండ సుధీర్‌, శివారెడ్డి, మల్లి, విల్సన్‌, కిరణ్‌లతో పాటు మొత్తం పది మందిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు కావలి డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. డ్రైవరుపై దాడి చేసిన నిందితులపై ఇప్పటికే నేరారోపణలు ఉన్నాయని... సస్పెక్ట్‌ షీట్‌ తెరిచి ఉందన్నారు. కావలి రెండో పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధిలోని వెంగళరావునగర్‌లో వీరు ప్రత్యేక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. నిందితులపై కఠిన చర్యలు ఉంటాయని ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు ప్రకటనలో తెలిపారు. నిందితులు ఎంతటివారైనా చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళన చేస్తామని ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దామోదరరావు, నరసయ్య హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story