RTC: దసరాకు ముందు ప్రయాణికులకు శుభవార్త
దసరా పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రయాణికులకు ఆర్టీసీ యాజమాన్యం శుభవార్త చెప్పింది. ఏపీఎస్ఆర్టీసీ తరపున 6,100 స్పెషల్ సర్వీస్ లు నడిపేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 4 నుంచి 11వ తేదీ వరకు అంటే దసరా పండగకు ముందు 3,040 బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇక దసరా మూడు రోజుల రద్దీ పెద్దగా ఉండదు కాబట్టి స్పెషల్ సర్వీస్ లకు అధికారులు బ్రేక్ ఇచ్చారు . దసరా తర్వాత అంటే అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు 3,060 స్పెషల్ సర్వీస్ లను ఏపీఎస్ఆర్టీసీ నడిపేందుకు నిర్ణయించింది.
దసరాకు 6 వేల ప్రత్యేక బస్సులు
దసరా పండుగ సందర్భంగా 6,000 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయి అని టీజీఎస్ఆర్టీసీ వెల్లడించింది. ప్రయాణికులు ఆన్‌లైన్ లేదా బస్సు స్టేషన్‌ల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు అని తెలిపింది. హైదరాబాద్ శివారు నుంచి దసరాకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ ప్రత్యేక సేవలు దసరా సమయంలో అనేక మందికి ప్రయోజనకరంగా ఉంటాయి.
డిస్కౌంట్ కూడా..
రాను పోను ప్రయాణ టికెట్లు ఒకేసారి బుక్ చేసుకునేవారికి ఏపీఎస్ఆర్టీసీ రాయితీ కూడా ప్రకటించింది. తిరుగు ప్రయాణానికి కూడా టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ రేటులో 10శాతం రాయితీ ఇస్తారు. విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ మధ్య నడిచే ఏసీ బస్సులకు కూడా ఈ రాయితీ సౌకర్యం వర్తిస్తుంది. ఏపీలోని జిల్లా కేంద్రాల మధ్యే కాకుండా తెలంగాణ, చెన్నై, బెంగళూరు ప్రాంతాలకు, అక్కడినుంచి వచ్చే వారికోసం కూడా ప్రత్యేక బస్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు అధికారులు.
రైళ్లు కూడా
బస్సులతోపాటు దసరా సందర్భంగా ప్రత్యేక రైళ్లు కూడా ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. అక్టోబర్ నెలలో మొత్తం 650 స్పెషల్ ట్రైన్స్ ని నడిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే నిర్ణయించింది. నవంబర్ నెలలో కూడా వీటిని కంటిన్యూ చేయడానికి షెడ్యూల్ వేసింది. పండల సందర్భంగా రద్దీని నివారించేందుకు స్పెషల్ సర్వీస్ లు నడుస్తాయి. అయితే రైల్వే మాత్రం స్పెషల్ సర్వీస్ లకు స్పెషల్ చార్జీలను ఫిక్స్ చేస్తుంది.
సెలవులే సెలవులు
తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు అక్టోబరులో భారీగా సెలవులు రానున్నాయి. దసరా నుంచి దీపావళి వరకు అక్టోబర్‌లో 16 రోజులపాటు పాఠశాలలు మూతపడనున్నాయి. అక్టోబరు 2 నుంచి 14 వరకు 13 రోజులపాటు దసరా సెలవులు ఉండనున్నాయి. అక్టోబరు 31న దీపావళి సెలవు. 14 రోజులు పండుగ సెలవులతోపాటు.. అక్టోబరు 20, 27 ఆదివారాలు కలిపి అక్టోబరులో మొత్తం 16 రోజులు సెలవులు వస్తున్నాయి. ఈ నెలలో 15 రోజులే స్కూళ్లు నడవనున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com